యుగయుగాలుగా నాకోసం వేచి చూస్తున్న నిన్ను శరవేగంతో వచ్చి అందుకుని నీ గాఢ పరిష్వంగంలో ఐక్యం అయ్యి, నీలో నేనుగా, నాలో నువ్వుగా జీర్ణమయ్యి నీ చిలిపి కలహాల్ని ఆరగించి, నీ విరహ వేదనని శ్వాసించి, క్రమించి, రమించి, ఉపశమించి, అలసతతో దగ్థమై, ఒక విశేషమూర్తిగా రూపాంతరం చెందాలని నా తపన, యాతన, వేదన.
దేవుడిచ్చిన విలువైన వరానివైన నిన్ను పెంచుకోవాల్సింది, నీతో జీవితం పంచుకోవాల్సిందీ నువ్వు వుంటున్న ఆ ఇంట్లోకాదు-
మనవూరి నదిలో ఎన్నోమైళ్ళు ప్రయాణం చేస్తే కనిపించే నిర్జనమైన, ఎత్తయిన పాపికొండల సమూహం దిగువున దర్శనమిచ్చే మైదానంలో మనమిద్దరమే శ్రమించి నిర్మించుకుందాం అందమయిన కుటీరాన్ని. దానిచుట్టూ వెన్నెల వృక్షాల్ని పాతుకుందాం. నక్షత్రాల్ని పువ్వులుగా పూయించుకుని, శతకోటి చందమామల్ని ఫలాలుగా పండించుకుందాం. తొలకరి జల్లుని, వణికించే చలిని, వెచ్చని సూర్యుడ్నీ అవసరమయినప్పుడు పిలుచుకుందాం. గ్రీష్మంతో పనిలేదని చెప్పేసి వసంతంతోనే బంధుత్వం పెంచుకుందం.
ఎన్నోఏళ్ళుగా ఎదురుచూస్తున్న ప్రియుడు ఎన్నో వందలమైళ్ళ దూరం నించీ ఆమెకు రాసిన ప్రేమలేఖ అది. అనుభూతుల్ని ఆహారం చేసుకుని బతుకుతున్న ఆమె పేరు రాధ.