శ్రీమద్రామాయణమును సంస్కృత భాషలో వాల్మీకి రచించాడు. భారతీయ సంస్కృతికి రామాయణము, భారతము ప్రధానమైన కావ్యములు, పురాణాలు, ఇతిహాసాలు. తపస్వియైన వాల్మీకి తన గురువైన నారద మహర్షిని ఇలా ప్రశ్నించాడు.  ''ఈ లోకమున ఒక మహానుభావుడైన పురాణ పురుషుడు నాయకుడుగా ఒక కావ్యము వ్రాయదలచుకున్నాను. ఆ నాయకుడు ప్రస్తుతము జీవించియున్నవాడు కావాలి. గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యవాక్కునందు ధృఢమైన వ్రతము కలవాడై యుండాలి'' అని మొదలుపెట్టి ఎన్నో సద్గుణాలను ప్రశ్నించాడు. ఈ సద్గుణాలన్నీ శాశ్వత కాలానికి సంబంధించినవి. అంటే మానవుడు ఎప్పటి కాలపువాడైనా సరే అభ్యసించడానికి ప్రయత్నం చేయవలసినవి.
అంతా విన్న నారదమహర్షి ఇలా అన్నాడు. ''చాలా దుర్లభమైన గుణాలను కీర్తించావు. అయినా అలాంటివాడు ఈ లోకములో ప్రస్తుత కాలమున ఉన్నాడు. అతడు నీ పరిప్రశ్నల ద్వారా నీ వాక్కుల నుండి ఇప్పటికే రూపాన్ని పొందాడు. అంటే నీకు కావలసిన నాయకుణ్ణి నీలోని వేద ధర్మ సంస్కారాన్ని అనుసరించి నీవే అవతరింప చేసుకున్నావు. ఇక వానిని గూర్చి నీవు కావ్యము వ్రాయవచ్చు. అయినా అలాంటివాణ్ణి గురించి నన్ను కూడా అడిగావు గనుక విను. ఇక్ష్వాకు వంశంలో పుట్టి 'రాముడు' అనే పేరుతో జనులచేత కీర్తింపబడుతూ ఒకడున్నాడు. అతడు నీ కావ్యసృష్టికి నాయకుడు. 'ఈ విధంగా రాముని గూర్చి నారదుడు వాల్మీకికి ఉపదేశం చేసి సంగ్రహంగా రాముని కథ చెప్పాడు.
రాముని తత్త్వము సకల ధర్మస్వరూపము. అభివృద్ధి, శ్రేయస్సుకోరిన వ్యక్తికి, సంఘానికి, జాతికి మొత్తం మానవజాతికి ఆచరణీయమైన ధర్మము. అది తారుమారైనప్పుడల్లా మరల స్ధాపించడానికే ఆ పరమపురుషుడు అనేక అవతారమూర్తుల రూపంలో దిగి వస్తుంటాడు. అలాంటి అవతారమే శ్రీరాముడు.
సంస్కృత భాషలో ఉన్న శ్రీ రామాయణమును చదివి అర్ధం చేసుకోవడం చాలామందికి సాధ్యపడని విషయం కనుక వాల్మీకి రామాయణమును సరళమైన తెలుగు వచనంలో అనువాదం చేసిన వారు శ్రీ శ్రీనివాస శిరోమణి గారు. పరితుల సౌకర్యార్ధం మూడు భాగాలుగా ప్రచురితమైన ఈ గ్రంధాన్ని వలయవారు ఒకేమారు తీసుకోవలసి వుంటుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good