ప్రపంచ సాహిత్యచరిత్రలో రామాయణం ఆదికావ్యం. అద్వితీయమైన కావ్యం. రామకథని మనోహరంగా చెప్పిన అమృతప్రవాహం.
అంతే కాదు. ఇది వేదోపబృంహణమైన రచన. అంటే వేదాలలో ఉన్న మంచిమాటలు మానవులందరికీ అర్థమయేలా రాముడిచరిత్ర ఆధారంగా చెప్పిన మహోపదేశం.
వేదకాలం నాటికి గాని, రామాయణకాలం నాటికి గాని ప్రపంచంలో ఏ మతమూ లేదు. ఏ ఇజమూ లేదు. ఉన్నదల్లా ఒకటే. మానవజాతి సుఖశాంతులతో మనుగడ సాగించేందుకు మార్గమైన ధర్మం.
లోకాన్ని ధరించేది, నిలబెట్టేది ధర్మం. ''ధారణాత్ ధర్మ ఇత్యాహు:.''
మానవుడై పుట్టిన ప్రతివ్యక్తి పాటించవలసిన ధర్మాన్ని తెలియచెప్పే రచన రామాయణం. అద్దం చూసి ముఖం దిద్దుకున్నట్లు, మానవులు రామాయణం చదివి తమ జీవితాలు దిద్దుకుంటారని ఆశించి చేసిన రచన ఇది.
రామాయణంలోని ఏడు కాండాలను (బాల కాండము, అయోధ్యాకాండము, అరణ్య కాండము, కిష్కింధా కాండము, సుందర కాండము, యుద్ధ కాండము, ఉత్తర కాండము) ఏడు సంపుటాలుగా రచించారు రచయిత.
ఇది 24 వేల శ్లోకాల సుధాస్రోతస్విని. దీనిని మూలంలో ఉన్నది ఉన్నట్లు, అందరికీ అర్థమయేలా సరళమైన తెలుగులో ప్రతి శ్లోకానికి తాత్పర్యం వ్రాయించి ఒక ప్రమాణ గ్రంథంగా ప్రచురించారు.
2050 పేజీలున్న ఈ 'వాల్మీకి రామాయణము యథా మూలానువాదము' అత్యుత్తమమైన క్వాలిటీ ముద్రణతో కేవలం రూ. 495లకే అందిస్తున్నారు.