ఇతివృత్తం - కథా సారాంశం
సీన్ - 1
నారాయణముని గొప్ప తపస్వి. భగవత్సాక్షాత్కారాన్ని కోరి మోక్ష సాధన లక్ష్యంగా నిష్ఠగా తపస్సు చేసుకుంటూ వుంటాడు. ఇంద్ర పదవిని ఆశించి తపస్సు చేస్తున్నాడేమో అన్న భయంతో దేవేంద్రుడు, తపోభంగం కావించమని రంభను పంపిస్తాడు. నారాయణముని చలించకపోగా, తన ఊరువునుండి మరో అప్సరస ఊర్వశిని సృష్టించి, రంభకు దీటుగా నిలబెడతాడు. రంభ, ఊర్వశి - ఇద్దరూ పోటీపడి నృత్యం చేస్తారు. రంభ రాజసం ఓడిపోతుంది. ఇంద్రుడు తాపసిని క్షమంచమని ప్రణమిల్లుతాడు. నారయణ ముని క్షమించి ఊర్వశిని స్వర్గాధిపతికి కానుకగా ఇస్తాడు.
సీన్ - 2
దేవేంద్రలోకంలో ఇంద్రుడు, శచీదేవి కొలువై యుంటారు. యక్షులు, గంధర్వులు, అప్సరసలతో సభ నిండుగా ఉంటుంది. భరత మహాముని అప్సరసలకు నాట్యరీతులు వివరించి, నాట్యం నేర్పిస్తుంటాడు. నాట్యం చేస్తున్న ఊర్వశి మనస్సు తడబడుతుంది. తాళం తప్పుతుంది. భరతుడు కోపంతో - భూలోకంలో పుట్టిన నీకు మట్టివాసన పోలేదు. అక్కడికే వెళ్లి ప్రక్షాళన చేసుకుని రమ్మని శపిస్తాడు.....