ప్రేమ సాగరంలో మునకలేద్దాం పదండి
కాశ్యాంతు మరణం ముక్తి:
స్వరణాదరుణాచలే!

కాశీలో మరణిస్తే ముక్తి. అరుణాచలా అని స్మరిస్తే విముక్తి అని అర్ధం. అలాంటి అరుణాచలేశుడి సన్నిధిలో వెలసిన రమణ మహర్షి మానవాళి మీద అపార కరుణతో ప్రవచించిన ఉపదేశసారమిది. పదేళ్ళపాటు వృత్తిరీత్యా మద్రాస్‌లో ఉన్నా ప్రక్కనే ఉన్న తిరువణ్ణామలై (అరుణాచలానికి) వెళ్ళే యోగం లేకపోయింది. సినిమా యిండస్ట్రీ అంతా హైదరాబాద్‌ వచ్చేశాక అటువైపు వెళ్ళాలన్న కోర్కె కలగడం, వెళ్ళడం, అపారమైన శాంతిని పొందడం జరిగాయి. అప్పటికి ఆజ్ఞ అయ్యిందన్నమాట!

రమణ మహర్షి దక్షిణామూర్తి స్వరూపం. ఎక్కువగా మౌనంగానే సలహాలు, ...ఆశీస్సులు అందిస్తూ ఉంటారు. ఆ మౌన స్వామి యొక్క మహా ప్రవచనమే ఆ ఉపదేశసారము. ఉపదేశసారం కర్మ, భక్తి, జ్ఞాన, రాజ, యోగాల సమాహారం. అయితే నేను రమణ మహర్షి యొక్క ఉపదేశసారాన్ని ఎన్నోసార్లు చదవాలని ప్రయత్నించాను. ఎన్నిసార్లు చదివినా, నాకు తత్త్వం బోధపడలేదు. అంత తేలిగ్గా బోధపడేదీ కాదు...దానికి ఎంతో సాధన కావాలి. అయితే ఎన్నిసార్లు చదివినా అర్థం కాని ఉపదేశ సారానికి భగవాన్‌ శ్రీ ప్రేమ సిద్ధార్థ వ్యాఖ్యానం క్రొత్త ద్వారాలు తెరిచింది. ఏదో అర్ధమయినట్లు, చీకట్లోకి క్రొత్త కాంతి కిరణం ప్రసరిస్తున్నట్లు...హృదయమంతా కాంతిమయము, శాంతి మయము అయిపోయినట్లు అదో అద్భుత అనుభూతి! స్వామి వారి భాష మృధు మధురం. ఎంత గాఢమైన భావాన్నైనా అత్యంత తేలిక పదాలతో చెప్పడం, పసి పిల్లలకు బోధిస్తున్నట్లు బోధించడం, స్వామివారి ప్రత్యేకత. భగవాన్‌ శ్రీ ప్రేమ్‌ సిద్ధార్ధ స్వామివారి ఈ ఉపదేశసారము మన హృదయ క్షేత్రాల మీద అమృతపు జల్లు. కొన్నాళ్ళపాటు అలా దీన్ని చదువుతూపోండి! మీకు తెలియకుండానే ఎన్నో ఆధ్యాత్మిక కుసుమాలు పూసి, ప్రపంచమంతా ప్రేమ పరిమళిస్తుంది. - తనికెళ్ళ భరణి

Write a review

Note: HTML is not translated!
Bad           Good