'అరువ్‌ ఇంకా గట్టిగా అరువ్‌! ఎవడొస్తాడో చూస్తాను. అరువ్‌'' అంటూ ఆమెను అమాంతం గాలిలోకి ఎత్తి క్రింద పడవేశాడు ఆటోడ్రైవర్‌. ఆమె ముఖం మీదనే చూపుల్ని కేంద్రీకరించి రాక్షసుడి మాదిరి ముందుకు పడబోతుండగా, వెనకనుండి అతని భుజం మీద పడిందో చేయి. అదిరిపడి అటుచూసిన అతని కనులకు వెంటనే కనిపించారు లావుగా పొట్టిగా ఉన్న ఇద్దరు స్త్రీలు.

పోలీసులకు, ఎక్సయిజ్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులకు తెలియకుండా ఆ అపార్ట్‌మెంట్స్‌ వెనుకభాగంలో వుండే ముళ్ళపొదల మధ్య దొంగ సారా వ్యాపారం చేసుకుంటూ వుంటారు వాళ్ళు. అతనికి తెలుసు.

''మీకు సంబంధించిన వ్యవహారం కాదు యాదమ్మా ఇది. వెళ్ళిపొండి, ఇక్కడినుండి వెళ్ళిపొండి'' కోపంగా వారిని హెచ్చరించాడు అతను.

''నీ మూలంగా అందరి దృష్టి ఈ పొదలమీద పడి మా రహస్యం బట్టబయలు అయిపోతుంది. ఇక్కడ నువ్వు ఏమీ చేయటానికి వీలులేదు. ఇంకెక్కడికైనా తీసుకుపో'' ఖచ్చితమైన కంఠంతో అతన్ని హెచ్చరించింది. ఆ ఇద్దరిలోను ఎక్కవ లావుగా వున్న స్త్రీ

''నేను ఎక్కడికీ పోను. ముందు మీరు ఇక్కడినుండి వెళ్ళిపొండి'' అంటూ విసురుగా తల పక్కకు తిప్పుకున్నాడు ఆటోడ్రైవర్‌.

చిన్నసైజు చెట్టు మాదిరిగా వున్న చేతిని పైకి ఎత్తి దభీమని శబ్దం వచ్చేలా అతని వీపు మీద బలంగా కొట్టింది యాదమ్మ. అతని షర్టును పిడికిలితో బిగించి ఎలుక పిల్లను ఈడ్చినట్టు వెనక్కి ఈడ్చి పడేసింది. కార్నర్‌ చేయబడిన పిల్లి మాదిరి ఎదురు తిరిగాడు ఆటోడ్రైవర్‌. హఠాత్తుగా తన ప్యాంట్‌ జేబులో నుంచి చిన్నబాకు తీసి ఆమె గుండెలమీద పొడవటానికి ప్రయత్నం చేశాడు. అప్పుడు కల్పించుకున్నది ఆ గొడవనంతా చూస్తూ వున్న రెండవ స్త్రీ. తన ఎడమకాలిని ఎత్తి అతని తొడమీద బలంగా తన్నింది. తొడలు విరిగిపోయినంత బాధ మెదడును అవరించుకునేసరికి గావురుమని అరిచి నేలమీద చతికిలబడిపోయాడు ఆటోడ్రైవర్‌.

'వీడి సంగతి నేను చూసుకుంటాను. నువ్వు ఆ పిల్లను తీసుకుని రోడ్డుమీద దిగబెట్టిరా' అని తన పార్టనర్‌కి చెప్పి, ముంజేతులకున్న గాజుల్ని మోచేతుల దగ్గరికి జరుపుకున్నది యాదమ్మ.

చదవడం మొదలుపెడితే పూర్తయ్యేదాకా వదలబుద్ధి కానంతగా, ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో మధుబాబు రాసిన థ్రిల్లర్‌ 'టచ్‌ మి నాట్‌'.

Write a review

Note: HTML is not translated!
Bad           Good