ఒక గంభీరమైన సామాజిక, రాజకీయ, సాంస్కృతిక చింతన కలిగిఉండి, తన చుట్టూ ఉన్న సమాజ, సమూహాలను నిశితంగా పరిశీలన చేసి, తన పరిశీలనలో నిగ్గుతేలిన కటువైన జీవన వాస్తవాలను, వివిధ కోణాల నుంచి దర్శించి పరిపక్వంగా, సంపూర్ణంగా ఆవిష్కరిస్తున్నాడు షరీఫ్. ఇతని కథలు చదవటం వల్ల మనకు తెలియని మరో సమూహపు జీవితమంతా తేటతెల్లమవుతుంది. అతి ప్రత్యేకత జోలికి పోకుండా వివిధ వాద, సిద్ధాంత, భావజాల ప్రభావాలకు అతిగా లోనుకాకుండా జీవితం ముందు విధేయంగా నిలబడ్డాడు షరీఫ్. ఆ జీవితం అందిస్తున్న పలు పర్వాశ్వలను కథలుగా మలుస్తున్నాడు. కథను పౌరవిద్యకు ఒక సాధనంగా మలిచి చూపుతున్నాడు. - సీతారాం
ముస్లింలలో వున్న భిన్న ఉపకులాల వేదనిని ఎలా చెప్పాలో షరీఫ్‌కి తెలుసు. వాళ్ళ బతుకు మీదా, భాష మీదా షరీఫ్‌కి చాలా పట్టు వుందని ఈ కొత్త కథల్లో అర్థమవుతుంది. - అఫ్సర్
''టోపి జబ్బార్ లాంటి కథలు సామాన్య కథలుగానే అనిపిస్తూ, విశేషంగా ఆకట్టుకుంటాయి. ఇదొక అడాలసెంట్ ప్రేమ కథ. జబ్బార్ అమ్ముల్ని ఇష్టపడటం మొదలు పెట్టాక, తలపై టోపీ లేకుండా కనబడేందుకు నానా అవస్థలు పడతాడు. అమ్ములుకు మాత్రం జబ్బార్ని టోపీలో చూడాలని కోరిక. ఏదో సందర్భంలో అమ్ములు తిరుపతికి వెళ్లి గుండు కొట్టించుకుంది. జబ్బార్ అంగీకరించలేకపోతాడు. చివరకు తనకు ఏ హక్కు లేదని తెలిశాక కూడా గుండు ఎందుకు కొట్టించుకన్నావ్ అని అడుగుతాడు. గుండులో అమ్ములు బాగా లేదని కూడా ఇబ్బంది పడతాడు. అప్పుడు ఆ అమ్మాయి ఇలా అంటుంది 'గుండు యాడన్న బావుంటాదా? బావుండే దానికా గుండు కొట్టిచ్చుకునేది. అది దేవుని కార్యం. దేవునికి ఏదిష్టమైతే మనమది సెయ్యాల''.
పేజీలు ఫ 142