తెలుగులో తొలి నవల శ్రీరంగరాజు చరిత్ర. అయితే రాజశేఖర చరిత్రకు ఆ ప్రసిద్ధి వచ్చింది. పరిశోధకులు, విమర్శకులు ఈ గ్రంథం పరిశీలించి, ఆ నవల ప్రాథమ్యం గుర్తిస్తారు. ప్రతిష్ఠిస్తారు. నా ప్రతిపాదన అంగీకరిస్తారు. సాహిత్యలోకం విశ్వవిద్యాలయాలు ఈ విమర్శ గ్రంథం గుర్తించి, దీని ప్రాధాన్యాన్ని పరిశీలిస్తారు. ప్రకటిస్తారు. సహృదయులు, ఆలోచనాపరులు తెలుగులో తొలి నవలగా 'శ్రీరంగరాజు చరిత్ర'ను స్వీకరిస్తారు. - కొలకలూరి ఇనాక్
శ్రీరంగరాజు చరిత్ర - శ్రీరాజశేఖర చరిత్ర
శ్రీరంగరాజు చరిత్ర నరహరి గోపాలకృష్ణమ సెట్టి నవల. నవీన ప్రబంధం. వచన ప్రబంధం. 1872లో ముద్రితం. స్వతంత్ర రచన.
శ్రీరాజశేఖర చరిత్ర, కందుకూరి వీరేశలింగం పంతులు వచన ప్రబంధం. 1878లో ముద్రితం. అనువాద రచన.
రెండింటిని రచయితలు వచనప్రబంధం అన్నారు. నరహరి గోపాలకృష్ణమ సెట్టి నవీన ప్రబంధమని, ఆంగ్లంలో నావెల్గా వ్రాయ సంకల్పించినట్లు వివరించాడు.
మొదటిది స్వతంత్ర రచన. రెండవది అనువాదం. ఆంగ్ల నవలానువాదం.
మొదటిది వెలువడ్డ ఆరేళ్ళకు రెండవది వెలువడింది.
మొదటిది దానిలోని కథ : శ్రీరంగరాజు తండ్రి, తల్లి శారద, కృష్ణయ్యల మీద అలకతో ఇల్లు వదలివెళ్ళి నల్లమలలో తిరిగి అనేక కష్టాలు ఎదుర్కొని సోనాభాయిని వెంట బెట్టుకొని తిరిగి రావటం.
రెండవదానిలోని కథ : రాజశేఖరుడు ముఖస్తుతులకు లొంగి సంపద కోల్పోయి, పరాయి ప్రదేశానికి పోయి, తోవలో అష్టకష్టాలు పడి దు:ఖితుడై కోలుకోవడం ప్రధానాంశం.
రెండు నవలల్లో ఇద్దరు కథానాయకులు ఇల్లు వదిలిపోయారు. ప్రయాణంలో చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. ఆపదలు పొందారు. తర్వాత ఊరట చెందారు. కథా ప్రణాళిక కొంత సమానంగా ఉంది.