హాస్యం అంటే ఒక రకం పైత్యాంతక రసం. ఈ రసాన్ని మించిన మందు లేదు. మనలోని, మన సమాజంలోని అన్ని పైత్యాలను హరింపచేసే, ప్రకోపాన్ని అణచాలని చూసే శక్తిగల మందు. అటు పాశ్చాత్యులు నిర్మించుకున్న ఔషధ తయారీ విధానాన్ని, ఇటు మన ఆయుర్వేద వైద్య విధానాన్ని అవగతం చేసుకొని సిద్ధమైన రూపంలో అరకు, ఇంజెక్షను, టాబ్లెట్టుల రూపంలో వచ్చింది. అటు వారి రసాయన కూటమిని, ఇటు మన పుటాన్నీ, పాకాన్నీ ఇముడ్చుకొని తయారయింది. ఈ గ్రంథంలో గుచ్చెత్తిన హాస్య రచనలు, విదేశీయుల కొనమెరుపుల్ని, రిపార్టీలనీ, మన పద్య, గద్య వైభవాన్నీ పునరుక్తి పటుత్వాన్నీ ఎలా నిలబెట్టినవో వివరిస్తాయి. హాస్య రచన ఒక విధంగా చూస్తే ¬మియోపతీ మందు లాంటిది కూడా. ఈ తీపి గుళికలు పొటెన్సీ తక్కువయినా బాగా పనిచేస్తాయి. ఎక్కువయినా అమోఘంగా సేవ చేస్తాయి. భాషాశక్తి తక్కువయిన రచయితలూ రాణించవచ్చు, ఎక్కువయినవారు చెలరేగిపోవచ్చు. ఇందుకు ఈ గ్రంథంలో పాత రచయితల అనేక రచనా శకలాలు ఉదాహరణలుగా కనబడతాయి. |