వ్యాసునిచే వివరించబడి విఘ్నేశ్వరునిచే వ్రాయబడిన 18 పురాణాలలో విష్ణుపురాణం పరాశరునిచే చెప్పబడినదయితే, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే గరుత్మంతునికి చెప్పిన ''మానవ మోక్ష పథ దీపిక'' గరుడ పురాణము.

మరణానంతరం పొందే యీ స్ధూల సూక్ష్మ కారణ దేహాలజీవి ఆరాటపోరాటాలు, ప్రేతాత్మలు పొందే యాతనా శరీర అవస్థలూ, జీవాత్మలు ప్రేతాత్మలైనాక భవితవ్య వివరణలు తెలుపు పురాణం ''శ్రీ గరుడ పురాణం''.

సాత్త్వికాలు, రాజసాలు, తామసాలు అని పురాణాలను మూడు రకాలుగా విభజించారు. గరుడపురాణము సాత్త్విక పురాణాలలో చేరుతుంది. గరుడపురాణములోని పూర్వఖండంలో 'అగ్నిపురాణం'లో లాగా అనేక విషయాలు వివరించబడి వున్నాయి. ఇందలి ఉత్తర ఖండాన్ని 'ప్రేతకల్ప' మంటారు. ఈ భాగాన్ని శ్రాద్ధ సమయంలో చదివే సంప్రదాయం ఏర్పడింది. పూర్వఖండాన్ని ఎప్పుడైనా చదువవచ్చు!

గరుత్మంతుడు అడిగిన ప్రశ్నలకు మహావిష్ణువు చెప్పిన సమాధానాలు ఈ పురాణంలో వున్నాయి. మరణానంతరం జీవుని స్ధితి ఎలా వుంటుంది అన్న విషయం ఉత్తరఖండంలో విపులంగా చెప్పబడి వున్నది. అందువల్లనే శ్రాద్ధ సమయంలో దీనిని చదివే అలవాటు ఏర్పడింది. ఇతర పురాణాలలో లభించని అమూల్యమైన అనేక విషయాలు ఈ పురాణంలో ఉండడం గమనార్హం. అది  తెలియక కొందరు కేవలం యమలోక వార్తలే ఇందులో వుంటాయని భ్రమిస్తారు. అతిస్వల్పమైన కేవలం ఒక పార్శ్వాన్ని మాత్రమే చూస్తూ, విష్ణు మహాత్మ ప్రతిపాదికమైన విస్తృత పార్శ్వాన్ని విస్మరించడం ఎంతమాత్రం భావ్యం కాదు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good