ఉలిక్కిపడి లేచాను.
సౌకర్యాల పొరల్లో నిద్రిస్తున్న
నా నగ్న మనఃశిసువుని ఎవరో కొరడాతో ఛెళ్ళుమనిపించినట్టు
ఉలిక్కిపడి లేచాను..!!
మగత నిద్రలో పీడకలలా
మానవుడి నిజ హింసాస్వరూపం అద్దంలో చూసి ముచ్చెమటలు కక్కుతూ
ఉలిక్కిపడి లేచాను..!!
మానవజాతి "అభివృద్ధి"లో ఏనాడో
తగిలి మరుగున పడిన గాయం ఇంకా పచ్చిగానే ఉందనీ..
రూపం మారింది గానీ సారం మారలేదనీ..
అక్షరాల ప్రవాహంలో పడి కొట్టుకుపోతూ
ఎరుపెక్కిన కళ్ళతో...
నిద్ర లోంచి లేచాను..!!
ఏడు తరాలు - ఇది చదవని జీవితం అసంపూర్ణం.
- వినోద్ అనంతోజు
********
ప్రపంచవ్యాప్తంగా ఈ పుస్తకం విశేష ప్రాచుర్యం పొందింది. ఒక్క అమెరికాలోనే 25 లక్షల మేలిప్రతులు అమ్ముడయ్యాయి. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ దేశాలలో పది లక్షల ప్రతులు చొప్పున ఖర్చయ్యాయి. 30 దేశాలు ఈ పుస్తక ప్రచురణ హక్కులు కొనుక్కున్నాయి. దేశ దేశాల్లో కోట్లాది పాఠకుల ఆదరణకు ఇంతకు మించిన నిదర్శనం వేరేలేదు. స్వేచ్ఛ నుంచీ సంకెళ్ళకు, సంకెళ్ళ నుంచీ విముక్తికి సాగిన ఒక ప్రస్థానం 'ఏడుతరాలు'.