మధ్యతరగతిని ఒక ఇంటి పేరుగా తీసుకుని తెలుగు సమాజానికి కొత్తగా పరిచయం చేస్తారు విహారి. అవసరానికి ఆదుకునే బంధువులు, ఇంటి మొత్తానికి ఒకడే సంపాదనా పరుడుగా ఉండడం, ఆచారాలు - సంప్రదాయాల పేరిట ఆదాయాన్ని మించి ఖర్చులు పెట్టడం, అనవసర ఆర్భాటాల మధ్య జీవితాన్ని సంక్షుభితం చేసుకోవడం, తమ గురించి కాక, తమ చుట్టూ ఉన్న సమాజం ఏమనుకుంటుందో అన్న ఆలోచనతో బతకడం లాంటి లక్షణాలు ఈ మధ్యతరగతికి అంటుకున్న ప్రవర. ఈ దశనుంచే విహారి ఇరవై ఒకటో శతాబ్దపు కొత్త వాకిలిని పరిచయం చేస్తాడు. మూడు తరాలమధ్య పెరుగుతున్న అంతరాల్లోంచి మొదటితరం అయిన తల్లిదండ్రులు స్వచ్ఛంగా వృద్ధాశ్రమాలకు వెళ్ళడమనే ఒక మెలకువను విహారి కథలు గురిస్తాయి. 'కొత్త నీరు' ఎప్పుడూ పాతనీటిని వెలుపలకి పంపిస్తుందనే చిన్న కామన్ పాయింట్‌ని గ్రహిస్తే... చాలా ఇళ్లల్లో గొడవలు ఉండవనే సామరస్యపు సాధుతత్వాన్ని విహారి కథలు ఎక్కువగానే చెపుతాయి. ఇలా చెప్పడంలో కూడా లాజిక్‌ను మర్చిపోకపోవడమే ఈ కథల స్పెషాలిటీ.
పేజీలు :191