సాహిత్యం సమాజాన్ని ముందుండి నడిపించేది. కాని నేడు పూర్తిగా వెనకబడి సినిమా, టివి రంగాలు ముందుండి సమాజాన్ని శాసిస్తున్నాయి. సినిమాలు, టివిలో వస్తున్న డైలీ సీరియళ్లు, 'నేరాలు-ఘోరాలు', క్రైమ్‌ వార్తలు, ముఖ్యంగా 'సంసారం ఒక చదరంగం', 'రచ్చబండ' లాంటి రియాల్టి షోలు సమాజం కుళ్ళుని పచ్చిగా ఎండగడుతున్నాయి.

'నా భర్త అర్థరాత్రి నన్ను వదిలి ఆయన సొంత అక్క పక్కలో పడుకుంటున్నాడు' అని ఓ ఇల్లాలు ఆక్రందన.

'మా మాయ్య నన్ను బలవంతం చేయబోయాడని నా భర్తకు చెపితే నన్ను వదిలేసాడు' అని మరో ఇల్లాలు దీనగాథ.

'నా భర్త కన్ను మా అమ్మ మీద పడీ...' అని ఓ ఇల్లాలు నిస్సహాయస్థితి. ఇలాంటి పచ్చి వాస్తవాలను చూస్తుంటే గుండె రగిలి, కడుపులో పేగులు సుడులు తిరుగుతున్నాయి. మన సభ్యసమాజం ఎటుపోతోంది? మనం ఎవరి చుట్టూ బతుకుతున్నాము? మనం ఇంకా ఊహల్లో విహరిస్తూ, కల్పిత కథలు రాయాలా? ఎవరికోసం?

ఇలాంటి 'అతివాస్తవ' కథలను సాహిత్యంలో జొప్పించే సమయం వచ్చేసింది. కప్పి చెప్పేది కవిత్వం. విప్పి చెప్పేది కథ. గంగానది ఎంత పవిత్రమైందో కవిత కప్పి చెప్పవచ్చుగాక. కాని ఆ నది అడుగున పేరుకుపోయిన మురికి గురించి కథ విప్పి చెప్పాలి.

ఆ మురికిని వెలికితీసే ప్రయత్నంలోనే 'కన్యాశుల్కం', 'చింతామణి', 'మైదానం', 'అంపశయ్య' లాంటి గొప్ప పుస్తకాలు పుట్టాయి.

అప్పట్లో 'కన్యాశుల్కం'ను ఓ కులంవాళ్లు బహిష్కరించారు.

'చింతామణి' నాటకం పచ్చి బూతని ఎంతమంది తిట్టలేదు?

'మైదానం'ను ఎంతమంది కించపరచలేదు?

ఇలాంటి రచనలు ఇప్పుడు ఇంకా చాలా పుట్టాలి. తప్పదు. నేటి సాహిత్యం కట్టుబాట్లు కొంచెం సడలించాల్సిందే.

నన్ను నేను సమర్థించుకోవడం కాదు కాని మగ గైనకాలజిస్ట్‌ ఆడ రోగిని చెక్‌ చేస్తే అందులో తప్పులేదు. ఇక అందులో కూడా బూతుంది అంటే నేను ఏమీచేయలేను. నేను 'ది ఎక్స్‌-రే మ్యాన్‌' ఇంగ్లీష్‌ నవల రాసాక నాకు అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చి - రోజుకు వందల్లో ఈ-మెయిల్స్‌ వస్తున్నాయి. అందులో దాదాపు 64 దేశాలలో నివసించే భారతీయులు, ముఖ్యంగా తెలుగువాళ్లు తమ దీన గాథలను నాకు ఈ-మెయిల్లో రాసారు. నా ఒళ్ళు జలదరించింది. ఇప్పటివరకు నేను  రాసిన దాదాపు 300 హాస్యం, వ్యంగ్యం కథలు ఎవరిని ఉద్ధరించాయనే ప్రశ్న మొలకెత్తింది. అందుకే వాళ్ల పేర్లు రాయకుండా వాళ్ల దీన కథలు రాసాను. ఇందులో ఏ ఒక్క కథను నేను ఊహించి రాయలేదు. ఇందులోని కొన్ని కథలు అక్రమసంబంధాల చుట్టే తిరుగుతాయి. ఆ అక్రమ సంబంధాల పర్యావసానాలు ఎలా వుంటాయో, వాటి వల్ల ఎన్ని జీవితాలు నాశనం అవుతాయో, ఎన్ని హృదయాలు చితికిపోతాయో వివరించాను.

నేటి హైటెక్‌ యువతకు ప్రేమకు, శృంగారిని, కామానికి, బూతుకు గల తేడాలు స్పష్టంగా తెలియాలి. అందుకే ఇలాంటి కథలు నేటి హైటెక్‌ తరానికి చాలా అవసరం అని నేను గట్టిగా నమ్ముతున్నాను.

నేను ఇందులో ప్రత్యేకించి ఏ నీతి చెప్పలేదు. ఈ కథలు చదివాక మనం ఎలాంటి తప్పులు చేయకూడదో తెలుస్తుంది. అంతే! పక్కింటో దొంగలు పడ్డారని తెలిస్తేనే మనం ముందు జాగ్రత్తపడతాం. అందుకే ఈ సంకలానికి 'నీతిమాలిన వాళ్ళ నీతికథలు' అని నామకరణం చేసాను. - మోహనరావు దురికి (మోహన్‌ ఆర్‌.డి.)

పేజీలు : 176

Write a review

Note: HTML is not translated!
Bad           Good