ఒకప్పుడు భగవంతుని ఆజ్ఞానుసారం భూమిపై ప్రవేశించిన ధర్మ చక్రం వెనుక, శౌనక మహాముని నాయకత్వంలో ఎనభై ఎనిమిది వేల మంది నైష్ఠిక బ్రహ్మచారులు బయలుదేరారు. ఆ చక్రం గంగనుదాటి గోమతీ భగవతీ నదీ తటంలోని ఒక ఘోరారణ్యానికి వెళ్ళి ఆగింది. ధర్మచక్రం యొక్క నేమి (చక్రం చుట్టూ వుండే కడ్డీ) వదులై, ఎక్కడైతే పడిపోయిందో, ఆ అరణ్యానికి రుషులు, నైమిశారణ్యమని పేరు పెట్టారు. నూతమహాముని అనేక పురాణ గాథలు చెప్తూ వుండగా, వారంతా దీర్ఘకాలం అక్కడే నివసించ నిశ్చయించుకున్నారని పురాణ గాథ.
'నైమిశం' అసలు అరణ్యమే కాదనీ, కనురెప్ప మూసినా తెఱచినా, కాలం మార్పును గమనించక ఉండే స్థితిని, నైమిశారణ్యమంటారని ఒక ఆధ్యాత్మిక సూక్తి. సాథకుడు ఈ స్థితిని ధ్యాన సమాధుల ద్వారానే అందుకోగలడు. కౄరమృగాలు జీవించే ఘోరారణ్యాలలోనైనా, కౄర స్వభావులు నివసించే జనారణ్యాలలోనైనా, మానవ ధర్మాన్ని కనుగొంటూ వుండడం సాధకుని కర్తవ్యం. ఆ కనుగొన్న ధర్మం నిత్యజీవనంలో కర్మాచరణగా రూపొందుతూ వుండడం అవశ్యం. అదే ధర్మ బద్ధమైన జీవితమంటే.
జాతి మతాల కతీతమైన ఇలాంటి ధర్మవర్తనులు, ఈ నైమిశ గ్రంథంలో అనేకులు మీకు దర్శనమిస్తారు. నరులు మానవులుగా పరివర్తన చెందడానికి మార్గం చూపిస్తారు.
ఇందులో పొందుపరచిన కథలు, ఇతివృత్తాలు ప్రపంచంలోని పలు మూల గ్రంథాల నుండి సేకరించినవి. కథ గనక జాగ్రత్తగా వింటే మనిషి అంతుకు మునుపు ఉన్నట్లు ఉండలేడంటాడు వ్యాసమహర్షి. వినోదం కోసం చదివినా, ఏదో ఒక కథ, మనిషి పూర్వ సంస్కారాలను, వాసనలనూ ఛేదించుకొని లోనికి చొచ్చుకుపోయి, అనుకోని వేళలో మనసును విస్ఫోటన చెందించవచ్చు. - నీలంరాజు లక్ష్మీప్రసాద్
Pages : 143