వందేళ్ళ కిందట 1912లో ఆంధ్రదేశంలోని శ్రీ కొవ్వలి లక్ష్మి నరసింహారావుగారు జన్మించారు. పాతికేళ్ళు కూడా పూర్తికాకముందే 1935లో 'పల్లెపడుచు' అనే నవలను రచించారు. ఆ తర్వాత మహావేగంతో సంవత్సరానికి వందనవలల చొప్పున 30వ ఏట అడుగుపెట్టేనాటికీ 600 నవలలు రచించారు.
ఒక జీవనకాలంలో వేయినవలలు రచించిన నవలారచయిత లెందరు? కొవ్వలి ఒక్కరేనేమో. వీరి చివరి నవల 'మంత్రాలయ'.
అతి సరళమైన శైలిలో సూటిగా కధను నడపడం కొవ్వలి ప్రత్యేకత. ఆధునిక జీవితానికి అద్దంపట్టే రచనలు చేశాడు. రమ్యమైన కధనంతో నీతిబోధను జోడించాడు.
తన నవల నెల తిరగక ముందే పునర్ముద్రణకు వచ్చేటంత ప్రచారం పొందిన రచయిత కొవ్వలి. కొద్ది నెలలలో వేల కాపీలు అమ్ముడయ్యేవి అక్షరాస్యత అంతంత మాత్రంగా ఉన్న రోజుల్లోనే. ఇప్పటికీ కొవ్వలి నవలలకు ఆదరణ తగ్గలేదు.
కొవ్వలి భయంకర్ పేరుతో రచించిన జగజ్జాణ అనే ఈ నవల 25 భాగాలుగా ప్రచురితమై తెలుగువారి అభిమానాన్ని చూరగొన్నది.తెలుగు వాళ్లు గర్వించదగిన నవలా రచయిత కొవ్వలి లక్ష్మి నరసింహారావుగారి శతజయంతి సందర్భంగా వారి నవలలన్నిటినీ క్రమంగా, సంపుటాలుగా తెలుగు పాఠకలోకానికి అందిస్తున్నాము.
శ్రీ భయంకర్ ఆంధ్ర పాఠకుల ఆదరాభిమానాలకు పాత్రులైన సుప్రసిద్ధ రచయిత. గతంలో వీరి "చాటుమనిషి", "విషకన్య" లాంటి డిటెక్టివ్, మిస్టరీ సీరియల్స్ పాఠకలోకంలో అత్యధిక సంచలనాన్ని కలిగించాయి. మిస్టరీ సీరియల్ రచనలో వారికీ వారేసాటి. పాత్రపోషణలోనూ కధాగమనంలోనూ పాఠకులను ఉర్రూతలూగించే శక్తి వారి సొంతం అన్న విషయం వారి రచనలు చదివిన పాఠక మహాశయులకు మేము ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
'జగజ్జాణ' లో చక్కనైన కధాసంవిధానంతో చిక్కనైన భాష మేళవించి పండిత పామరరంజకం గావించారు. జగజ్జాణలో ప్రతిభాగం పాఠకులకు ఒక నూతనసమస్యను సృష్టిస్తుంది. ప్రతి పేజి ఉత్సాహపూరితంగా ఉంటుంది. ప్రతి సన్నివేశమూ ముందు ఏం జరుగుతుందో అన్న ఉద్రేకాన్ని కలిగిస్తుంది. ఇటువంటి మిస్టరీ సీరియల్ పాఠకలోకానికి అందచెయ్యగలిగినందుకు ఎంతైనా సంతోషిస్తున్నాము.

Write a review

Note: HTML is not translated!
Bad           Good