'చివరి గుడిసె' బాధామయం, భయావహం అయిన తీవ్ర ఉత్కంఠతో కూడిన విషాదాంత గాథ. నాకు తెలిసినంత మటుకు ఇంత అద్భుతమయిన కథని నేను తెలుగు సాహిత్యంలో ఇంతదాకా చదవలేదనే చెప్పాలి. శిల్పంలో, చిత్రణలో, ప్రయోజనంలో ఒక 'కన్యాశుల్కం' ఒక 'యజ్ఞం' మాత్రమే దీనికి సాటిరాగల రచనలు. 

అయితే గురజాడ, ఉన్నవ, కాళీపట్నం వంటి మహా రచయితలు ఒకే కాలానికీ, ఒకే వ్యవస్థకూ చెందిన వైరుధ్యాల్ని చిత్రించగా డా|| కేశవరెడ్డి భిన్న వ్యవస్థలకు చెందిన వైరుథ్యాల్నీ, భూమిపైనా, పాతాళంలోనూ కూడా జరిగే పోరాటాన్నీ అత్యంత ప్రతిభావంతమైన శిల్ప నైపుణ్యంతో చిత్రించాడు ఈ నవలలో. 

తన మొదటి కథల్లోలానే ఇందులో కూడా గ్రామంలోని అగ్రవర్ణాలకూ, నిమ్నవర్గాలకూ జరిగే సంఘర్షణే స్థల ఇతివృత్తం. కాని ఈసారి కథాకాలం దాదాపు యాభై ఏళ్ళ వెనక్కు జరిగింది. అక్కడ నుండి మరొక ఇరవయ్యేళ్ళు వెనక్కుపోయి చెప్పుకొస్తాడు కథని. అంటే సుమారు 1928 నుండి 45 మధ్యకాలంలో జరిగిన కథ. స్పష్టంగా తేదీలు ఇవ్వకపోయినప్పటికీ ఈ కథలోని ప్రనతి సంఘటనా తన నిర్ధిష్ట చారిత్రక నేపథ్యాన్ని ఎంతో స్పష్టంగా ప్రకటిస్తూనే వుంటుంది. 

ఆంధ్రప్రదేశంలోని నల్లమల అడవుల నుండి నెల్లూరు సముద్ర తీరం దాకా విస్తరించి ఉన్న సంచార గిరిజన తెగ యానాదులు సామాజిక పరిణామంలో ఆహార సేకరణ దశకు చెందిన జాతి. ఏళ్ళ మీదట వారి చుట్టూతా సమాజం వివిధ ఆర్థిక దశల్ని దాటుతూ స్థిర వ్యావసాయిక జీవితంలోకి స్థిరపడిన వందల యేళ్ళ తరువాత కూడా యానాదులు తమ ప్రాచీన ఆర్థిక విశ్వాసాలకే అంటిపెట్టుకుని వుండిపొయ్యేరు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good