దేశంలో అసహనం పెచ్చుమీరుతోంది. ఎవరి స్వేచ్ఛకు తగ్గట్టు వారు జీవించాలన్న పద్ధతిని తుంగలో తొక్కి తాము నిర్దేశించినట్టే జీవించాలని సంఘపరివార్ శక్తులు శాసిస్తున్నాయి. ఏం తినాలి..? ఏం మాట్లాడాలి..? ఏ దుస్తులు ధరించాలి..? అనే విషయాన్ని వారే నిర్దేశిస్తున్నారు. కాదని ఎదురు నిలిచినవారిపై భౌతికదాడులకు తెగబడుతున్నారు. 2015 తరువాత భావప్రకటనా స్వేచ్ఛ ఒక కలగా మారింది. కల్బుర్గీ, పన్సారి, దబోల్కర్, గౌరీలంకేష్లను పొట్టనపెట్టుకున్నారు. కంచె ఐలయ్య లాంటి దళితవాద రచయితలను బెదిరిస్తున్నారు. పెచ్చుమీరుతున్న అసహనాన్ని వ్యతిరేకిస్తూ, రచయితలపై దాడులను నిరసిస్తూ కొంత మంది రచయితలు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను వెనక్కిచ్చేసిన పరిస్థితిని చూసాం. గోమాంసం, లవ్ జీహాద్ పేరిట దళితులను, ముస్లిములను, మైనారిటీలను ఊచకోత కోస్తున్నారు. అన్ని రంగాల్లోనూ రాణిస్తూ పురుషులతో సమానంగా సమాజపురోగతిలో పాలుపంచుకుంటున్న మహిళలను మళ్లీ వంటింటికే పరిమితం చేసే విధానాలు తీసుకొస్తున్నారు. దేవంలో సామరస్యాన్ని కాపాడాల్సిన పాలకులే నిస్సిగ్గుగా భౌతిక దాడులకు పాల్పడిన వారిని ప్రోత్సహిస్తూ వెనకేసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో వివిధ పత్రికల్లో వెలువడిన వ్యాసాలను సంగ్రహించి వేసిన పుస్తకమే 'స్వేచ్ఛకు సంకెళ్లు'.
పేజీలు : 104