కధా, నవలా రచయిత్రిగా, కాలమిస్ట్ గా శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారి పేరు తెలుగు పాఠకలోకానికి సుపరిచితమే. 'శ్రీవారికి ప్రేమలేఖ' సినిమా కధా రచయిత్రిగా ప్రేక్షకులకు అభిమాన రచయిత్రి ఆమె.
కధా రచయిత్రిగా విజయలక్ష్మిగారు బహుముఖీనమైన కధన కౌశలం చూపుతున్నారు. వ్యంగ్యం, హాస్యం ఆమె పలుకుల్లో, కధన శిల్పంలో అలవోకగా జాలువారుతాయి. 'నగలగోవిందం' 'ఇట్టే వంట ఒట్టేసింది' 'చీరెల సుబ్బారావు' 'ఈ - పార్టీ' వంటి కధల్ని చదివి ఆనందించండి.
మానవ సంబంధాలలోని సంక్లిష్టతని ఆవిష్కరించేప్పుడు ఇతివృత్తాన్ని ఆర్ద్రతని కూర్చిచదువరులకి గాఢమైన అనుభూతిని కలిగించగలరు. 'సన్మానం' 'కుశాగ్ర బుద్ధి' వంటివి దీనికి నిదర్శనం.
ఎంతెంతటి ఆధునిక సాంకేతికత, శాస్త్రవిజ్ఞానం విజ్రుంభించినా - శాశ్వతమైన కుటుంబ బంధం అనే భావోద్వేగం మాత్రం "భారత రసాయన శాస్త్రం"గా విలక్షణంగా లోకంలో నిలిచే ఉంటుంది అంటారు - అదే పేరు గల కధలో!
విజయలక్ష్మి గారు విలోమ కధలస్పెషలిస్ట్! "ఏలిన వారి దివ్య సముఖమునకు" అనే ఒక్క కధ చాలు - భారతీయ కధా రచయిత్రులలోనే ఆమెకి ప్రధమ పంక్తి స్థానం దక్కాలని చెప్పటానికి.
ఇంకా... ఇంకా... ఆమె కధలు మనిషి లోని బహు పార్శ్వాలు అనుభవ వైవిధ్యాన్ని చూపుతాయి. సాంస్కృతిక విలువల్ని గురించి ఆరాట పడతాయి. 'రవ్వంత' అనురాగాన్నీ, గోరంత ఆప్యాయతనీ చిత్తంలో నిలుపుకొండి' అని నిరాడంబరంగా, అమ్మ మాటలాగా చల్లగా, మెల్లగా చెబుతాయి. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good