ఒక సహృదయుడు పేర్కొనినట్లు విశ్వకవి రవీంద్రనాథ ఠాకూర్‌ అన్ని కాలాలకూ అన్ని సంస్కృతులకూ వారసుడు. ఆయన అమృతలేఖనినుంచి కవితలు, కథానికలు, నవలలు, నాటకాలు, వ్యాసములు పరశ్శతంగా వెలువడినవి. ఆ మహాకవి స్పర్శతో పల్లవింపని సాహిత్యశాఖ యేదీ కనిపించదు. పైగా ఆయన గాయకుడు, చిత్రకారుడు కూడా!
కవిగా, కథానికుడుగా, నాటకకర్తగా, నవలా రచయితగా సహృదయలోకానికి చిరపరిచితులయిన రవీంద్రులు వెయ్యికి పైగా ఖండ కావ్యములూ, రెండు వేలకు పైగా గేయములూ వెలయించారు. ఒక్క మాటలో చెప్పాలంటే మానవులకు ఏయే విషయాలు ఆసక్తములో వాటన్నిటిమీదా ఆయన అభిరుచి ప్రసరించింది. సమృద్దమయిన భారతీయ సంస్కృతి, మొగల్‌ దర్బారులోని విశాల రీతులు, వంగదేశములోని సామాన్య జనుల జీవితమందలి సహజసత్యములు, నేటి ఐరోపా ఖండంలోని బుద్ధిప్రాగల్భ్యము వీటి సమ్మేళనంతో రవీంద్రుల కవిత ప్రాదుర్భవించినదని పేర్కొనవచ్చు.
ప్రస్తుతం వెలువడుతున్న ఏకోత్తరశతిలో 101 ఖండకావ్యాలు అందాలు దిద్దుకొన్నవి. బెంగాలీనుంచి తెలుగు చేయబడిన ఈ ఖండ కావ్యాలు సాహితీప్రియులకు ఆస్వాద్యములగు ననడంలో సందేహం లేదు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good