కవిత్వం వొక వెతుకులాట!
ఒక దృశ్యం ఒక అదృశ్యం. ఒక అవును ఒక కాదు. ఒక జ్వాలాగ్ని ఒక కొసగాలి. ఒక సత్యం ఒక స్వప్నం. ఒక డిస్కవరీ ఒక ఇన్వెన్షన్. ఒక తెరను తొలగించి చూపించడం, ఒక ప్రపంచాన్ని సృష్టించి ఆవిష్కరించడం.
ధాత్రిని ప్రేమించిన ఏ కవి అయినా, రాత్రినీ ఇష్టపడాలి. కవికి వెలుతురెంత ఇష్టమో, చీకటీ అంతే ఇష్టమవ్వాలి. జనంతో కలిసి నడవడమెంత ఇష్టమో ఏకాకిగా నిలుచుండిపోవడమూ అంతే ఇష్టం కావాలి. అన్నాన్నీ ఆకలినీ సమానంగా ఇష్టపడాలి. అమృతాన్ని ఆస్వాదించాలి. విషాన్ని దిగమింగాలి. విషం తాగినందుకు మరణిస్తే, అమృతం తాగి ఉన్నందువల్ల జీవించగలగాలి.
లోపలి మనిషిని, వెలుపలి సమాజాన్ని సంధానపరచే వంతెన కవిత్వం. కనిపించని అంతర్లోకాల వ్యక్తీకరణ కవిత్వం. కనిపించే భౌతిక ప్రపంచ ఆవిష్కరణ కవిత్వం. వెరసి ఆ రెండింటి మధ్య సంభాషణ కవిత్వం. ఆ రెండింటి సంస్కరణ కవిత్వం.
ఆ సంభాషణలో ఆ సంస్కరణలో నిమగ్నమై ఉన్నారు రామచంద్రరాజు గారు. ఒక సత్యస్వప్నాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఒక స్వప్నాన్ని సత్యంగా చూపిస్తున్నారు. ఇందులో 1980 ల నుంచీ ఇటీవలి దాకా రాసిన కవిత్వం ఉంది. అది కవి చేస్తున్న కవిత్వ ప్రయాణాన్ని సాధిస్తున్న పరిణామాన్ని సూచిస్తుంది.