ఇక్బాల్ భగవద్గీతను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అందలి కర్మ సిద్ధాంత ఛాయలు ఖురాన్ లోనూ కనిపిస్తా యన్నాడు. ఆయనకు రామాయణ మంటే మహాప్రీతి. అందుకే సర్.కిషన్ ప్రసాద్‌కు వ్రాసిన ఒక లేఖలో 'జహంగీర్ కాలంలో మసీహ్ అనే ఆయన రామాయణాన్ని పారశీకంలోని కనువదించాడు. వీలైతే దాని ప్రతిని నాకు సంపాదించి పెట్టండి; ఉరుదూ లోనికి అనువదించడానికి ప్రయత్నిస్తాను' అని వ్రాశాడు.
''రాముడు భారతీయులకు గర్వ కారణుడైన వ్యక్తి. ఈ దేశంలో వేలాది మంది మహానుభావులు ఉద్భవించి విశ్వకళ్యాణానికి ఎంతగానో దోహదం చేశారు. అట్టి వారిలో శ్రీరాముడు అగ్రగణ్యుడు. ఆయన శూరుడు, సాహసి; పవిత్రుడు-పైగా ప్రేమ స్వరూపుడు'' అని ప్రశంసించాడు.
బుద్ధుని బోధనలను భారతీయులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఇక్బాల్ బాధపడ్డాడు. ''చెట్టు తన ఫలాల రుచిని తాను తెలిసికోదన్నట్లు భారతజాతి ఆయన విశిష్టతను గుర్తించలేక పోతున్న'' దంటాడు. మానవత్వాన్ని గౌరవించడమే అసలైన సంస్కృతి అని బుద్ధుడు నొక్కివక్కాణించడం గమనార్హం అంటాడు.