'మాట్లాడినట్టే సరిగ్గా రాయడం కూడా ఎవరికి సాధ్యం? అథవా రాసినప్పటికీ అందులో ఏమి పస ఉంటుంది?'' అనేవారికి కన్యాశుల్కంలోని ప్రతీ వాక్యమూ, ప్రతీమాటా తిరుగులేని జవాబిస్తాయి. సామాజిక వాస్తవికతను కన్యాశుల్కం ప్రతిబింబించినంత సంపూర్ణంగా మన దేశంలోని మరే యితర నాటకమూ ప్రతిబింబించలేదని నిస్సందేహంగా చెప్పవచ్చును. సంఘంలోని వివిధ వర్గాలకు, కులాలకు, వృత్తులకు, మన:ప్రవృత్తులకు చెందిన ఎందరో వ్యక్తులు నిత్య జీవితంలో తాము ఎలాగ మాట్లాడతారో, అలానే కన్యాశుల్కంలో మాట్లాడతారు. ప్రేక్షకులను మనస్సులో పెట్టుకొని వారిని నవ్వించడానికి కృత్రిమంగా ప్రవేశ పెట్టిన సంభాషణ లేవీ నాటకంలో లేవు. గిరీశం, రామప్పంతులు, పొలిశెట్టి, అసిరిగాడు ఒకరేమిటి ఎవరి గొంతుకయినా ఎక్కడైనా స్పష్టంగా పోల్చుకోవచ్చును. వాస్తవానికి దూరంగా నిలుచుని జీవితానికి మెరుగు పెట్టాలనుకుంటేనే భాషలోకి కృతకత ప్రవేశిస్తుంది. ఈ సందర్భంలో ''శిల్పం వాస్తవికతకు అతీతమైనది'' అని వాదించి ప్రయోజనం లేదు. ఫోటోగ్రఫీ కళ కాదని పొరపడే వాళ్ళ దృక్పథం ఇది. ఫోటోగ్రఫీని కూడా ఉత్తమ శిల్పం చేసే నిబంధనలు దీనిలోనే గర్భితమై వున్నాయి. గురజాడ సాహిత్యంలో జీవితాన్ని ఫోటోగ్రాఫ్‌ మాత్రమే కాదు. యక్సురే ఫోటోగ్రాఫ్‌ కూడా చేశాడు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good