ఇంటా బయటా భద్రత లేని స్త్రీల జీవితాల్లో అనునిత్యం చోటుచేసుకుంటున్న హింస చుట్టూ అల్లిన కథలివి. సమాజం నాగరికమయ్యే క్రమంలో ఆధిపత్యాలకు తావులేని మానవీయ విలువలు పెంపొందాల్సి వుండగారానురానూ దిగజారిపోతున్నందుకు రచయితగా గీతాంజలి అనుభవించే వేదనే యీ కథల్లో ప్రత్యక్షరంలోనూ వినిపిస్తుంది. స్త్రీ పురుష సంబంధాల్లో చోటుచేసుకొంటున్న హింసని ప్రత్యక్షంగా వర్ణిస్తూనే హింసకి కారణమయ్యే మూలాల్లోకి చూసేలా చేస్తున్న రచయిత స్వరంలోని తీవ్రత తీక్షణత చాలామందిని కలవరపెడతాయి. పాఠకుల్లో అటువంటి డిస్ట్రబెన్స్ని సృష్టించి ఆలోచింపజేయడమే ఆమె ధ్యేయం. అందుకే ఆమె తాను చెప్పదలచుకున్న విషయాల్ని అందమైన పదాల మాటునో ఆలంకారిక శైలి వెనకో ప్రతీకల చాటునో మరుగు పరచదలచ లేదు. అందుకే అన్ని రకాల సాహిత్య విధి నిషేధాలనూ ఛేదించిన డిక్షన్ వొకటి యీ కథల్లో సహజంగా చోటు చేసుకొంది.
పంచ కన్యల పురాణ గాథలు - వాత్స్యాన కామసూత్రాలు మొదలుకొని ఇవ్వాళ్టి వయాగ్రా మాత్రలు, సిలికాన్ యింప్లాంటేషన్లు, వెజైనోప్లాస్టీ - ఎక్స్ ట్రా నాట్ల వరకూ అన్నీ... లైంగిక తృప్తిని పురుష కేంద్రంగానే నిర్వచించి డిజైన్ చేయడంలో భాగంగానే పడగ్గదుల్లోకి ప్రవేశిస్తున్నాయనే స్పృహతో రాసిన కథలివి. జెండర్ స్వేచ్ఛా సమానత్వాల గురించి, సహజమైన ప్రేమాభిమానాలతో పరస్పరం గౌరవించుకొనే దాంపత్య సంబంధాల గురించి, సున్నితమైన దేహ భాషతో పరిమళించాల్సిన లైంగికత గురించి మగవాళ్ళని సెన్సిటైజ్ చేయడానికి ఆమె యీ వ్యూహాన్ని యెన్నుకొంది. ఇవాల ఈ గొంతు అవసరం. - ఎ కె ప్రబాకర్
పేజీలు : 168