కావ్యయుగం నుంచి ఆధునికయుగం వరకు - 238 మంది పూర్వ, మధ్య, ఆధునిక కవుల చరిత్ర.

వాజ్మయ చరిత్ర వ్రాయాలంటే ముందు ఆయాకవుల, వారు రచించిన కృతుల కాలం నిర్ణయించడం అత్యంతావసరం. ఇది ముందు నిర్ణయమైతేనేకాని మన ఆంధ్ర సాహిత్య క్రమ పరిణామం తెలుసుకొనేందుకు వీలుపడదు. ఒక్క వాజ్మయ చరిత్రకే కాదు, దేశ చరిత్రకైనా కాల నిర్ణయ ప్రణాళిక చాలా అవసరం. కాల పరిగణనలోని ముందు వెనుకలు, పూర్వోత్తరాలు నిర్ణయమైతే కాని జాతి ఏయే కాలాలలో ఎట్టెట్టి పరిణామ, వికాసాలు పొందిందో, భాషా వాజ్మయాలలోను, మతంలోను, కళలలోను ఎప్పుడెప్పుడెట్టి మార్పులు వచ్చినవో, ప్రజాభిరుచి ఎట్లా మారుతూ వచ్చిందో తెలియదు. కాల పరిగణన విద్య చరిత్రకు వెన్నెముక వంటిది. ఆంగ్ల విద్యాగంథం అబ్బిన తరువాతనే దేశీయులైన ఆంగ్ల విద్యాధికులు ఈ కాలనిర్ణయావశ్యకతను ఎక్కువగా గ్రహించారు. అంతకు పూర్వము కవులను గూర్చి, వారి కృతులను గూర్చి పిట్ట కథలవంటి కట్టుకథలే ప్రచారంలో ఉంటూ వచ్చేవి. కవి వ్రాసిన గ్రంథాలే అన్నీ తెలియనప్పుడు కవి జీవిత విశేషా లేమి తెలుస్తాయి?

కవులు గ్రంథాలైతే వ్రాశారుకాని వారు తమ జీవిత చరిత్రలు వ్రాసుకోలేదు. వారు తమ జీవిత చరిత్రల కంటెను తమ కృతులకే ప్రాధాన్యం ఇచ్చారు. ఎందుకంటే కృతి సప్త సంతానాలలో ఒకటి; అది పుణ్యకార్యమూ, కీర్తిదాయకమూ గనుక. కొందరు కవులు తమ కృతులను తమ యిష్టదైవముల పేర చెప్పినా చాలా మంది తమకాశ్రయ మిచ్చినవారికి, తమ్ము పోషించినవారికి అంకితమిచ్చి కావ్య ప్రారంభంలో సువర్ణతిలకాయమానంగా ఉండేటట్టు కృతి భర్తృ వంశాన్ని అభివర్ణిస్తూ వచ్చారు... - మల్లంపల్లి సోమశేఖరశర్మ

Write a review

Note: HTML is not translated!
Bad           Good