ఇప్పుడు ఈ పుస్తకం ఎందుకు?
నేను పల్లెటూరి నుంచి వచ్చినవాడిని. చదువుకోలేదు. సంస్కారం తెలీదు.మాట్లాడ్డం తెలీదు. పెద్దలు కనిపిస్తే నమస్కారం పెట్టాలని కూడా తెలియని వాడిని. అలాంటి నన్ను ఈ సినిమా ప్రపంచం ఒక మనిషిని చేసింది. "అక్కినేని నాగేశ్వరరావు" గా నిలబెట్టింది. పెద్దల సత్సాంగత్యంతోనే నేను ఎన్నో నేర్చుకున్నాను. మట్టిముద్ద లాంటి నాకు ఎందరెందరో మహనీయులు ఒక రూపం ఇచ్చారు. విభిన్నమైన పాత్రలు ధరింపజేసి నటుడిగా నిలబడడానికి అవకాశాలు కల్పించారు. ధరించిన పాత్రలు కూడా గురువులై నాకు పాఠాలు చెప్పాయి. అయితే, క్రమేణా పాత్రలను ఎన్నిక చేసుకునే సస్థితి కి వచ్చాను. నేను చయ్యగాలను అనుకున్న పాత్రల్నీ చెయ్యదగ్గ పాత్రల్నీ మాత్రమే ధరించాను. ఆ స్థితిలో ఎన్నో పాత్రలు నిరాకరించవలసి వచ్చింది. ఆ పెద్దలకి ఆగ్రహం తెప్పించావలిసి వచ్చింది. మొదట్నుంచి నన్ను ఎంతగానో ప్రోత్సహించి, నా భవిష్యత్తుకి బాట వేసిన నిర్మాతల మాట నేనెందుకు కాదన్నాను? వారికి మనస్తాపం కలిగించేలగా ఎందుకు ప్రవర్తించవలసి వచ్చింది. ఈ ప్రశ్నల వెనక బలమైన కారణాలు ఉన్నాయి.
ఈ నా నట జీవిత సాగరంలో లేచి పడిన తరంగాలు, సుడిగాలులు, అల్లకల్లోలాలు గురించి చర్చించడమే ఈ పుస్తకం. సినిమా నటుడు ఎదుర్కునే స్థితిగతులు తెలియజెప్పాలనే ఈ పుస్తకం.
- అక్కినేని నాగేశ్వర రావు.