మనం గర్వించదగ్గ దర్శకులలో శ్రీ ఎల్‌.వి.ప్రసాద్‌గారు ఒకరు.  మనదేశంలో సినిమా పుట్టిన తొలిరోజులనుంచి ఆయన యీ పరిశ్రమలో ఉన్నారు.  ఆయనలో ఉన్న పట్టుదల, శ్రమే ఆయనను ఇంతటివారిని చేశాయనిపిస్తుంది.  జీవితంలో ఆయన ఎన్నో దెబ్బలు, ఎదురుదెబ్బలు తిన్నారు.  తట్టుకున్నారు.  కుస్తీ పట్టారు.  కృషి చేశార.  'కృషితో నాస్తి దుర్భిక్షం' అన్న మాటను రుజువు చేశారు.  జీవితంలో ఆయన ఎన్నో రకాల బాధలూ అవీ చూశారు. ఎందరో మనుషుల వింత ప్రవృత్తులను పరిశీలించారు.  ఆ అనుభవం, అవగాహన చిత్ర దర్శకులకు ఎంతో అవసరం అని నా అభిప్రాయం.
ప్రసాద్‌గారి దర్శకత్వంలో 'పల్నాటియుద్ధం' (1947), 'సంసారం' (1950), 'పరదేశి' (1953), 'మిస్మమ్మ' (1953) చిత్రాల్లో నటించాను.  'ఇలవేలుపు' వారి సొంతచిత్రం గనక, యోగానంద్‌ డైరెక్ట్‌ చేసినా, ప్రసాద్‌గారు కూడా ముఖ్యమైన దృశ్యాలు చిత్రీకరిస్తున్నప్పుడు సెట్‌లో ఉంటూ సూచనలు చేస్తూ ఉండేవారు. వ్యక్తిగా ఆయనంటే నాకు ఎంతో గౌరవం, పూజ్యభావం. ఆయన నటుడు, ప్రతి పాత్రనూ అవగాహన చేసుకుని, నటించి చూపగల ప్రతిభ ఆయన దగ్గరుంది.  చిత్రంలోని 'డ్రామా'ని పండించడంలో ఆయన సిద్ధహస్తుడు.  ఆయన దగ్గర పనిచేసినవారు ఎందరో మంచి దర్శకులుగా రాణించారు.  ప్రసాద్‌గారు గొప్ప టెక్నీషియన్‌. దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా, స్టూడియో అధిపతిగా - ఇలా ఆయన అన్నింటిలోనూ రాణించినవారు!  ప్రజల మనస్తత్వం, ప్రేక్షకుల నాడి తెలిసిన దర్శకులు కొద్దిమందే ఉంటారు - అందులో ఆయన ఒకరు.  మన చిత్ర పరిశ్రమకు ఆయన వరప్రసాదం! - అక్కినేని నాగేశ్వరరావు

Write a review

Note: HTML is not translated!
Bad           Good