నాగేంద్రరావుగారి సినీ గీతాలపైన రచించిన ''లాహిరి లాహిరి లాహిరిలో'' అనే వ్యాఖ్యాన లహరిలో ఇది రెండవ సంపుటి. 1961లో వెలువడిన ''జగదేకవీరుని కథ'' నుండి 1972లో రూపొందిన ''నీతి-నిజాయితీ'' వరకు పింగళివారు రచించిన గీతాలకు సంబంధించిన చక్కని విశ్లేషణ ఫలితం ఈ గ్రంథం.

ఈ గ్రంథాన్ని రూపొందించిన డా|| వి.వి.రామారావుగారు బహుముఖీన వైదుష్యం కలవారు. ఒకవైపు రచనా వ్యాసంగం చేస్తూ మరోవైపు గాయకుడుగా తన విలక్షణ వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించినవారు రామారావుగారు.

ప్రతి గీతంలోని సాహిత్య, సంగీత, చిత్రీకరణ సంబంధి విశేషాలను సహేతుకంగా వ్యాఖ్యానిస్తూ పింగళి వారి అసదృశ రచనా వ్యక్తిత్వాన్ని మన కళ్ళముందు నిలిపారు రామారావుగారు. ఒకవైపు ఆయాగీతాల  సన్నివేశాలను ప్రస్తావిస్తూ, వస్తుపరంగా, భావపరంగా వాటి ఔచిత్యాన్ని ఉల్లేఖిస్తూ ఆ గీతాలలోని రాగాలను కూడా పేర్కొంటూ తమ వ్యాఖ్యానానికి సమగ్రతను సమకూర్చారు రామారావుగారు. నాగేంద్రరావుగారి గీత కుసుమాలకు ఇది సురభిళవ్యాఖ్యానం. - సినారె

Write a review

Note: HTML is not translated!
Bad           Good