పాడుదాం-ఆడుదాం పిల్లల పాటలు
లయాన్వితమైన బాలగేయాలు పిల్లల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి. వారిలోని సృజన శక్తులకు పునాదులు వేస్తాయి. బాలగేయాలు కావ్య రచనకంటే భిన్నమైనవి. పిల్లల పాటలు వ్రాయాలంటే కొన్ని ప్రత్యేక అర్హతలుండాలి. ముఖ్యంగా, అభ్యసనపరమైన మనశ్శాస్త్ర అవగాహన ఉండాలి. పిల్లల వయోదశకు, అవగాహనా స్ధాయికి అనువైన విషయాల ఎంపిక, తదనుగుణమైన భాషా శైలి కావాలి.
ఈ గేయ సంపుటిలో మాతృమూర్తిని సాక్షాత్కరింపచేసే గేయాలున్నాయి. 'అమ్మరుణం' అనే గేయం హృద్యంగా ఉంది. బడిని ప్రస్తావించిన గేయాల్లో 'సామాజిక పరివర్తన సాధనం బడి' అనే స్ఫూర్తి ఉంది. గేయాల్లో కొన్ని కథాత్మకంగా, కొనర్ని సంభాషణ రూపంలో కొన్ని అభినయానుగుణంగా, ఇంకొన్ని వర్ణనాత్మకంగా వైవిధ్యం సంతరించుకున్నాయి. శ్రమ గౌరవాన్ని చాటే 'సోమరికావద్దు' అనే గేయం ఎంతో ప్రభోధాత్మకంగా ఉంది. పొడుపుకథ, మాటలతో ఆట వంటి వినోదగేయాలూ ఈ సంపుటిలో చోటు చేసుకున్నాయి. ఇందులోని నలుబది నాల్గుగేయాలూ ఆణిముత్యాలే. అన్నింటినిలోను పిల్లలయెడ, వారి అభిరుచులు ఆసక్తుల గూర్చిన సమగ్ర అవగాహన వెల్లడి అవుతుంది.