తెలంగాణా ప్రాంతంగా వ్యవహరింపబడుతున్న తొమ్మిది జిల్లాల్లో చరిత్ర, శిల్పం, శాసనాలు, చిత్రలేఖనం, తాళపత్ర గ్రంథాలు, తటాకాలు, కోటలు, వీరగాథలు ఎన్నో ఉన్నాయి. సాహిత్యకారులు, కళావేత్తలు ఎందరో ఉన్నారు. అంతేగాక ఏండ్లతరబడి కాలాన్ని తీర్చిదిద్దడానికి, దేశాన్ని పురోగమింప జేయడానికి ఎడతెగకుండా జరిపిన ఉద్యమాలున్నాయి. వీటన్నింటిని వ్యాసాలరూపంలో ''ఆంధ్రప్రదేశ్'' అవతరణ సందర్భాన ''తెలంగాణం'' పేర మీకు అందిస్తున్నాం. - వట్టికోట ఆళ్వారుస్వామి
తెలంగాణకు గర్వించదగిన చరిత్ర వుంది. కారణాంతరాల వల్ల చీకటిలో పడి ఉంది. ఆంధ్ర చరిత్ర నియోన్ లైట్లకింద స్వర్ణకాంతులీనుతుంటే తెలంగాణ చరిత్ర కాగడా వెలుగుల్లో మసకమసగ్గా వుంది. నియంత నీలినీడల కింద, వలసల మాయతెర చాటున స్థానిక చరిత్ర సతాయించబడ్డది. 1952-56ల మధ్య కాలమే తెలంగాణ స్వతంత్రంగా జీవించిన దశ. ఆ దశలోనే చరిత్ర పరిశోధన సాగింది. సంస్కృతి గౌరవం పొందింది. సృజనశక్తి పురులు విప్పింది. ఒక సుదీర్ఘ పోరాటం నుంచి ఊపిరి పీల్చుకొని నిర్మాణాత్మకంగా పురోగమించింది. చరిత్ర నిర్మాణంలో భాగంగా వట్టికోట ఆళ్వారుస్వామి పనిగట్టుకొని 'తెలంగాణం' రెండు సంపుటాలు ప్రచురించాడు.
పేజీలు : 316