పదమూడేళ్ల సుదీర్ఘ పోరాటం, సుదీర్గ పయనం తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి తన లక్ష్యాన్ని చేరుకుంది.  అరవై ఏళ్ళుగా ఉన్న తెలంగాణ ఆకాంక్ష ఒక ఎత్తు అయితే, ఒక్కడిగా ఆరంభించి ఎన్నో రాజకీయ పద్మవ్యూహాలు చేధించుకుని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావు అధికార పగ్గాలు చేపట్టిన తీరు మరో ఎత్తు.  తెలంగాణ ఆవిర్భావం తెలుగువారి చరిత్రలో ఒక అంకం.  తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం ఆరంభిస్తున్నట్లు కెసిఆర్‌ ప్రకటించిన రోజున ఇది అయ్యేనా అనుకున్న వారే ఎక్కువ.  తెలుగుదేశం పార్టీ నుంచి విడిపోయి సొంతంగా పార్టీ పెట్టుకున్న రోజున కెసిఆర్‌ ఒక వ్యక్తే.  ఆ తరువాత ఆయన ఒక శక్తిగా మారారు.  ఆ శక్తే తెలంగాణ మొత్తం ఆవరించి అధికారాన్ని కైవసం చేసుకుంది.  తెలంగాణ ఉద్యమంలో ఎన్నో మలుపులు, ఆశ, నిరాశల మధ్య ఊగిసలాట.  పార్టీ ఉనికికి ప్రమాదం వచ్చిన ఘట్టాలు కూడా ఉన్నాయి.  కాని 2004 టిఆర్‌ఎస్‌ రాజకీయంలో ఒక కీలకమైన మలుపు అయితే 2014 టిఆర్‌ఎస్‌కు ఎదురులేని సంవత్సరంగా రూపొందింది.  ఎన్నికలలోగా ఆయా చోట్ల భారీ బహిరంగ సభలు, తెలంగాణ వాదాన్ని విస్తృతంగా ప్రజలలోకి తీసుకువెళ్లడం, ఆయా పార్టీల నుంచి భావసారుప్యం కలిగినవారిని ఆకర్షించడం.  కొత్తగా విద్యార్ధులలో తెలంగాణ ఉద్యమంపై అవగాహన పెంచడం వంటివి చేయడంలో కెసిఆర్‌ కృతకృత్యమయ్యారు.  తెలంగాణ అభివృద్థిలో వెనుకబడిందన్న వాదన ముందుకు తీసకువచ్చేవారు.  అభివృద్థిలో వెనుకబడలేదని ఎవరైనా అంకెలతో వివరిస్తే, దానిని అభివృద్థి మా హక్కు - తెలంగాణ మా ఆత్మ గౌరవం అన్న నినాదాన్ని తెరపైకి తెచ్చేవారు.  ఆ రకంగా ఉద్యమాన్ని తన భుజ స్కంధాల మీద వేసుకుని ముందుగా కెసిఆర్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఒక గుర్తింపు తెచ్చుకుని ఒక బలమైన వ్యక్తిగా ఎదిగారు.  ఆ తర్వాత 2004లో ఆనాటి విపక్షమైన కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు పెట్టుకుని ఇరవై ఆరు సీట్లను టిఆర్‌ఎస్‌ సాధించడం, కేంద్రంలోని మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వంలోను, ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌ రాష్ట్రంలోని వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలోనూ భాగస్వామి అయి సంచలనం సృష్టించడంతో బలమైన శక్తిగా మారింది. దాంతో కెసిఆర్‌పై, కెసిఆర్‌ రాజకీయాలపైన ఒక నమ్మకం ఏర్పడింది. గురి కుదిరింది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good