'తరాలు'' కేవలం కల్పితం కాదు. కేవలం సత్యం కాదు. జీవితం ''ఊహల కలగలుపు'' కంటికి అందంగా కనిపించే - కలనేత! సత్యం కల్పన, పడుగూపేకలుగాతయారైనదీకలనేత.
ఇది ఎవరిదో జీవిత చరిత్ర కాదు. అలా అని ఊహాగానం కాదు. నిజాన్ని - వెలుగు నీడల మధ్య పొదిగి రాశాను. బహుశా కొంత చూసికూడారాశానేమో.
కోటనందూరులో పుట్టి పులిగా కొనసాగిన వ్యక్తి జీవితంలో - జీవిత కాలంలో తన వంశంలోనే వచ్చిన ఒడిదుడుకులని, దృక్పథాల మార్పులని, చూసిన ఒక మహావ్యక్తి కథగానే మలిచాను. ఈ తరాల కథనానికి నరసింహం పంతులుగారి వ్యక్తిత్వం వెన్నెముకగా చేశాను. ఆయనే నా మాతామహుడు.
పల్లె ప్రాంతాలలో ఇమడలేక పట్నంవైపు చూపు మరల్చడం - ఆరోజుల్లో సహజం. పంతులుగారు ఉన్న వూరుని ప్రాణంగా ఎంచిన వ్యక్తి. వారికి, తన సంతానమే, అయినా వారి వెంటపడి పోలేని - దృఢమైన తత్వం. మన సంప్రదాయాలు, మన నేల, మన పెట్టిపోతలు, మన గౌరవాభిమానాలు - వదిలి ఎక్కడికేనా కదలవలసిన అవసరం ఆయనకి కనబడలేదు. అందరూ కఠినాత్ముడు, తన గోల తనదే అని విసుక్కున్నా - ఆడిపోసుకున్నా ఆయన పట్టించుకోలేదు! కారణం కాలం తన తప్పొప్పులు అంచనా వేస్తుందన్న గట్టి నమ్మకం. తన పంథా, అందుకే మార్చుకోవాలని అనుకోలేదెప్పుడూ.
ఆధునిక యువతులకి ఆప్యాయతలు వుండవనీ, సంప్రదాయాలకీ కట్టుబాట్లకీవిలువనివ్వరనీ చాలామంది - చాలా తేలికగా అనేస్తూంటారు. ఆధునిక వస్త్రధారణ, ఆధునిక ప్రవర్తన, ఆధునిక అవసరాలకి తగిన ఆలోచన, ఎదుగుబాటు ఇవన్నీ వారికి అవసరం. చదువుకున్న చదువుకి సార్థకత తేవాలన్న వారి కోరికలకి చాలా బలం వుంది. అలాగే- అంతరాంతరాలలో - వారికి - తమ సంప్రదాయం పట్ల - అర్థవంతమైన అవగాహనా వుంటుంది. అది పెద్దలు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే తరాల అంతరాల దూరం బాధపెట్టదేమోనని ఆలోచించాలి కూడా.
ఇది నాకు చాలా నచ్చిన థీమ్‌. ఇందులో వంశవృక్షాన్ని నిలపలేదుగాని - బీజం సూచించానేమో నాకు తెలియదు. వ్యక్తిగతంగా నేను కాస్త ఆశావాదిని. భవిష్యత్తుని బెంగతో ఎదురుచూడను. కష్టం - నష్టం, సుఖం - దుఃఖం, దరిద్రం - ఐశ్వర్యం - అంతేకాదు మనని కట్టిపడేసేవీ, తోసిపారేసేవీ - ఎన్నో - ఎత్తుపల్లాలు, బంధు, బాంధవ్యాలు వుంటాయి. ఇన్నిటినీ తోసిరాజనను. అలా అని భవిష్యత్తుపై భయంలో బ్రతకను.
కాలం ఎన్నో సమస్యలకి - పరిష్కారం చూపెడుతుంది. కాలానికి ముందు పరుగులు తీయలేను. అలా అని కాలానికి వెనకపడడం కూడా నాకు అసంతృప్తి కల్గిస్తుంది. అందుకే ఆధునిక యువతులంటే - నాకు చాలా ఇష్టం. వారి పురోగతి - నారీలోకానికి - కావాలి. అందరూ అనుకునేటట్టు అందరూ పాతతరాన్నితోసిరాజనడం లేదు - అనుకుంటాను. నమ్మకం అవసరమే. గాని దాని నిజానిజాలు పరీక్షించాలనుకోవడం ద్రోహం కాదు కదా? అనుకుంటాను. ఏ తరానికైనా తగినట్టు మారడం అవసరం.
ఈ ''తరాలు'' నవల చదివి ఆనందించాలని - నేను చదువరులని కోరుతున్నాను.
- కె. రామలక్ష్మి

Write a review

Note: HTML is not translated!
Bad           Good