1930 ప్రాంతాల తెలుగు నాటకరంగంలో సంచలనం సృష్టించిన నాటకం. పౌరాణిక, చారిత్రక నాటకాల హోరులో పద్యనాటకం వాస్తవికతను దూరంగా, గతచరిత్రలకు పట్టం కట్టే రోజుల్లో సాంఘిక నాటకాలు కూడా పద్య మాధ్యమంలో రాయవలసి వచ్చిన రోజుల్లో ఇరవయ్యవ శతాబ్దం తొలి దశకాల్లో ప్రచలితంగా ఉన్న ఒక సాంఘిక సమస్యను (వృద్ధులు బాలికలను వివాహం చేసుకునే ఆచారాన్ని) వాస్తవిక దృక్పధంతోను, వ్యావహారిక భాషలోను రాసి, ఆధునిక సాంఘిక నాటకానికి మార్గం సుగమం చేసిన ప్రతిభాసంపన్నుడు రాజమన్నారు. మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, కేంద్ర సంగీత నాటక అకాడమీ తొలి అధ్యక్షుడుగా అటు న్యాయశాఖలోను, యిటు సాంస్కృతిక రంగంలోను అత్యున్నత పదవులు నిర్వహిస్తూనే రెండు నాటకాలను, పద్నాలుగు నాటికలను, అనేక వ్యాసాలను పరిశోధనా పత్రాలను రచించి నాటక రంగాన్ని సుసంపన్నం చేసిన మార్గదర్శి రాజమన్నారు. ఈ నాటకాన్ని బళ్ళారి రాఘవగారి నేతృత్వంలో రాఘవ, కొమ్మూరి పద్మావతి ఎన్నో సార్లు ప్రదర్శించి దీనికి ప్రాచుర్యాన్ని కల్పించారు. దాదాపు అరవై సంవత్సరాలుగా ఈ నాటకప్రతులు ఎక్కడా దొరకడం లేదు. వర్తమాన నాటకాభిమానులకు ఉత్తమ తెలుగు నాటక సాహిత్యాన్ని అందుబాటులోకి తీసుకొని రావాలన్న తపన ఈ నాటక పునర్ముద్రణకు ప్రేరణ. తెలుగు నాటకాన్ని పద్యనాటకాల పరవళ్ల నుంచి దారిమళ్ళించి ఆధునిక సాంఘిక సమస్యా నాటకాల దిశగా నడిపించినవాడు రాజమన్నారు. రెండు తరాల విభిన్నమైన జీవిత విధానాలకు వారధిగా నిలిచి ఆనాటి సమాజంలో ఉన్న సమస్యల్ని తన పాత్ర చిత్రణా ప్రతిభతోను, తన జీవన దృక్పద ప్రగతితోను ఆవిష్కరించి కొత్త సంఘనీతికి, సరికొత్త సంఘరీతికి మార్గదర్శకుడైనావాడు రాజమన్నారు. తెలుగు నాటకచరిత్రను వాస్తవికతవైపుకు మళ్లించిన సంచలనాత్మక మూడంకముల నాటకం ఈ పుస్తకం. |