తనికెళ్ళ భరణి వ్రాసిన అయిదు నాటికల సంపుటం (గార్థభాండం, కొక్కొరోకో, గోగ్రహణం, ఛల్‌ ఛల్‌ గుర్రం !, జంబూద్వీపం) 'తనికెళ్ళ భరణి నాటికలు'. 

''గార్థభాండం''

సువర్ణాక్షరలిఖిత గత చరిత్రకూ, భావి ఉషస్సుకూ మధ్య వర్తమానపు అంధకారమే గార్థభాండం.  లంచగొండితనం, బందుప్రీతి ఇవే అధికార పీఠానికి పెట్టని అలంకారాలు. ఆ అవలక్షణాలను భరిస్తూ...సహిస్తూ మౌనంగా రోదించడమే ప్రజల తక్షణ కర్తవ్యం.  ప్రశ్నను భరించే శక్తి అధికారానికి ఉండదు.  గొంతు లేస్తే అది రాజద్రోహం.  ఆకలి మహాప్రభో అంటే రాజద్రోహం.  గాలిపీలిస్తే రాజద్రోహం.  ఎండిన ఆకులే భగ్గున మండుతాయి.  నిప్పురవ్వను ఆర్పాలనుకోవడం మూర్ఖత్వం.  మంట దావానలంగా చుట్టుముడుతుంది.  ఏ దేశంలో వేలిముద్రలు కిరీటాలను ధరిస్తాయో ఆ దేశపు ప్రతి అంగుళంలోనూ ఆరాచకపు పిశాచాలు విలయ తాండవం చేస్తాయి.  ఇటువంటి వ్యవస్థలో ప్రజలచేత ప్రజల కొరకు ఏర్పడి ప్రజలది మాత్రం కానిదే గార్దభాండం అనే సందేశంతో భరణి వ్రాసిన నాటిక ఇది.  వంశపారంపర్య వారసత్వ చరిత్రలో గాడిదలు గుడ్లు పెడతాయి. నరమాంస భక్షణకు అలవాటు పడ్డ పులులు భగవద్గీతను పఠిస్తాయి.  దున్నపోతులు ఈనుతాయి.  అజ్ఞానం, అవివేకం అధికార పీఠంపై కూర్చుంటే అవకాశవాదం, తెరవెనుక సూత్రధారత్వం చక్రాలను గిరగిరా తిప్పేస్తాయి.  ఈ అజ్ఞానాన్ని ప్రశ్నిస్తే అహంకారం ఉలిక్కిపడి నిలువునా గంగవెఱ్ఱు లెత్తుతుంది.  అది నిజం గొంతులను నిర్దాక్షిణ్యంగా నొక్కి వేస్తుందనే ఇతివృత్తంగా భరణి వ్రాసిన నాటిక గార్దభాండం.  పాలకుల దుర్నీతిని, నిర్లజ్జను నిర్భయంగా చీల్చి చెండాడిన నాటిక గార్థభాండం. ఈ నాటిక వర్తమాన రాజకీయ చిత్రపటాన్ని కలైడో స్కోప్‌లో చూపిస్తుంది... అలాగే

Write a review

Note: HTML is not translated!
Bad           Good