మహనీయులూ, మహానుభావులూఅయిన అనేక మంది తాపసులు మానవజీవన విధానానికీ తోడ్పడే అనేక విషయాలను తాళపత్రాల్లో రాసి, తమ శిష్యులతో దేశసంచారము చేయించి, గానరాగ యుక్తంగా ప్రజల్లోకి తీసుకెళ్ళేలా చేశారు. అలా ఎన్నో అమూల్యమైన విషయాలు ప్రజల జీవననాడిలో కలిసిపోయాయి.

ఆచారాల్లోనూ, వ్యవహారాల్లోనూ, రోజు వారి జీవన విధానాల్లోనూ ఎన్నో మార్గదర్శకాలని నిర్దేశించారు. కాలానుగుణంగానూ, ప్రకృతిపరంగానూ, మానవ శరీర నిర్మాణపరంగానూ చేయాల్సిన విధులు చెప్పారు. కొన్ని ఆచరణలో పెట్టరేమోనని తలచి భయాన్ని పెట్టి మరీ చేప్పారు. మరికొన్ని ముఖ్య విషయాల్లో భక్తిని చేర్చి ధర్మ, న్యాయం, నైతిక విలువల గూర్చీ చెప్పారు.

పెళ్ళికొడుకుని చేసిన తర్వాత ఏరు దాటకూడదని నొక్కి చెప్పారు. అలా చేస్తే అరిష్టమనే భయాన్ని పెట్టారు. అందులోని అంతర్లీన ఉద్దేశ్యము జాగ్రత్త. 'దురలవాట్లు ఉన్నవారేకాదు, లేనివారు కూడా వివాహ ఆనందంలో బయటికెళ్ళి ఏ ఉపద్రవమైనా తెచ్చుకోవచ్చు.' తద్వారా అనర్ధం జరిగే అవకాశం ఉంది. అందుకే కదలొద్దన్నారు. అందుకనే ఆచారమనే నియమాన్ని పెట్టారు. సంవత్సరానికొకసారి నదీస్నానం చేయ్యాలని చెబితే వినరేమోనని, భగవంతునికి ప్రియమైన రోజని చెప్పి అనేక వనమూలికల మీదుగా ప్రవహించే నదిలో స్నాం చేయించి, ఎన్నో రుగ్మతులను శరీరాన్నించి మనకే తెలియకుండా దూరం చేసేలా ఆచారాన్ని పెట్టారు.

గడపకి పసుపు రాయకపోతే లక్ష్మీదేవికి కోపం వస్తుందని చెప్పారు. అది సత్యమే. కానీ అందులో ఎంతో ఆరోగ్య మర్మముంది. ఇంట్లోకి పాములూ, తేళ్ళూ లాంటి విషక్రిములు రాకుండా ఉండాలంటే గడపకి పసుపు రాయాలి. అలా చెబితే రాయరని నిర్లక్ష్యం చేస్తారని ధననష్టమనే లక్ష్మీదేవి భయాన్ని పెట్టి, మనల్ని, మన పిల్లా పాలని ఎన్నో ప్రమాదాల నుంచి రక్షించారు. అలా భయపెట్టే విధంగా చెప్పనీ, భక్తితో కూర్చి చెప్పనీ, ఆరోగ్యంతో ముడిపెట్టి చెప్పనీ, ఆచారంగా చెప్పనీ, ప్రతి విషయమూ మన మనుగడ కోసమే. మంచి కోసమే. అలాంటి ఎన్నో విషయాలు కాలగర్భంలో కలిసిపోయే పరిస్ధితి ప్రస్తుతం కానవస్తుంది. మన పూర్వీకుల నుంచీ, మన తాతముత్తాతల నుంచీ వస్తున్న అనేక ఆనంద, ఆరోగ్య, ధర్మ, న్యాయ విషయాలు మరుగున పడిపోయే పరిస్ధితి నేటి వేగవంతమైన జీవితంలో కానవస్తోంది. గతంలో పెద్దలు చెపితే వినేవారు. మారుమాట్లాడకుండా చేసేవారు. ఆ రోజులు మారాయి. ఎందుకు? అని నేటి తరం ప్రశ్నిస్తున్నారు.. విడమర్చి చెప్పమంటున్నారు. అందుకే అలాంటి అమృత విషయాలని వృద్ధులనూ, పెద్దలనూ, గురువులనూ సంప్రదించి ఇంకా అనేక గ్రంథాలు పరిశీలించి, ఏరికూర్చిన సంజీవినీ స్వరాలే ఈ పుస్తకంలో అక్షరాలు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good