ఈ పుస్తకం కొందరు స్త్రీల వివాహ జీవితాలకు, జీవిత భాగస్వాములను కోల్పోయిన వారి వియోగ దు:ఖానికీ, ఆ దు:ఖంతో యుద్ధం చేస్తూ తమ జీవితాలను అర్థవంతంగా కొనసాగించే వారి స్థితప్రజ్ఞతకు సంబంధించినదిగా కనిపిస్తుంది. అందులో అసత్యమేమీ లేదు. ఈ పుస్తకంలో కనిపించే విషయం అదే. కానీ ఈ పుస్తకంలో దాగి వున్న మరో అమూల్యమైన విషయం స్త్రీల చరిత్ర. స్త్రీలు నిర్మించిన మన దేశ చరిత్ర. ఈ స్త్రీలు స్త్రీల చరిత్రలో అతి ముఖ్యమైన పాత్ర వహించినవాళ్ళు. దేశ చరిత్రకు రాళ్ళెత్తిన కూలీలు. వీరంతా దేశ స్వాతంత్య్రానికి ముందు జన్మించిన వాళ్ళు. స్వతంత్రోద్యమాన్ని దగ్గర గానో, కాస్త దూరంగానో చూస్తూ, ఆ ఉద్యమ ఛాయలలో సంచరిస్తూ ఆ స్వతంత్రేచ్ఛ కల్పించిన ఆశలదారులవెంట నడిచిన వాళ్ళు. దేశ నిర్మాణమనే పనిలో కొందరు తమ సంకల్పంతో ప్రత్యక్షంగా భాగస్వాములైతే మరికొందరు పరోక్షంగా చరిత్రని ప్రభావితం చేశారు. వీరు తమ కుటుంబాలలో మొదటితరం విద్యాధికులైన స్త్రీలు. బానిసత్వ భారం లేకుండా తమ తమ రంగాలలోకి ప్రవేశించినవాళ్ళు. ఎంపిక చేసుకునే హక్కుని పొందిన స్త్రీలు. ఆ హక్కుని సఫలం చేసుకున్న స్త్రీలు. - ఓల్గా
ఈ పుస్తకంలోని మహిళలు కొత్త కుటుంబ విలువల అన్వేషణలో వాటిని నూతన అవసరాలకి అనుగుణంగా ఎట్లా మార్చుకోవచ్చో చూపించారు.
సమాజం అంతగా కీర్తించి, కాపాడే బంధం తాలూకు స్వభావం ఏమిటి? దీర్ఘకాలంగా ఉన్న వివాహ బంధం నుంచి ఆధారపడటాన్ని, భేధభావాన్ని వేరు చేయగలమా? ఆ బంధం తాలూకు లక్షణం, బలం, దీర్ఘకాలం మనగలగడం యొక్క అంతరార్ధం ఏమిటి? గృహ పరిధి దాటి పంచుకున్న ఆసక్తులు, పని, నిబద్ధతలూ ఈ బంధాన్ని గట్టిపరుస్తాయా? లేకపోతే చాలా దశాబ్ధాలు ఒకే కప్పు కింద నివసించడం, పిల్లలు, వంటిల్లు పంచుకోవడం వల్లా? ఇంటినీ, కుటుంబాన్నీ ఒక సమాజం, దేశం నుంచీ విడదీసే, కాపాడే గీత ఏది? ఈ స్త్రీలలో ఉన్న అంత ప్రత్యేకత ఏమిటి? దీర్ఘకాలం తోడ్పాటునందించిన సాహచర్యం ముగిసినప్పుడు ఏమవుతుంది? ఒక మహిళ ఆ నష్టాన్ని ఎట్లా అనుభవిస్తుంది? ఎట్లా ఎదుర్కొంటుంది? - వసంత కన్నబిరాన్‌

Write a review

Note: HTML is not translated!
Bad           Good