విహంగమైనా పయోదమైనా, స్వేచ్ఛకోసమే దాన్ని వినుతించారు, భావకవులని పేరుబడిన కాల్పనికవాదులేన కవులు. తెలుగులో ఈ శతాబ్ది పూర్వార్థభాగ ప్రారంభకాలాన కాల్పనికత ఆనాళ్ల వింత. నవ్యత ఆనాళ్ల మోజు.
శ్రీరంగం శ్రీనివాసరావు ప్రథమ కవిత్వ రచన కూడా ఆనాళ్ల ముద్రతోనే వెలువడక తప్పిందికాదు. సంప్రదాయవాదుల నోళ్లు అప్పటికే మూగబడిపోయాయి. ప్రయోగపరులు కూడా అప్పటికే స్థిరపడి ఘనీభవించి నూతన సంప్రదాయ స్థాపన చేసేంతగా ప్రఖ్యాతి సంపాదించుకున్నారు. 'ఎంకిపాటల'పై లేచిన దుమారం అణిగిపోయి 'ఎంకి'కి గూడా నాయికా గౌరవం చేకూరింది. దానితోబాటు గేయరచనకు సాహిత్య సభాప్రవేశం సిద్ధించింది. 'గ్రామ్య'భాష, జానపదప్రణయం కావ్యంలోకి ఎక్కిరాగలిగాయి. 'సాహితి' పత్రికల గిరాకి హెచ్చింది. కవులు, భావకవులు, చలంగారి మాటల్లో దేశంమీద పడి సభలు, కావ్యగానాలు, గ్రంథవిక్రయాలు, ఆశ్రయాలు, సంఘ నిశ్రేణిలో అధిరోహణలూ సాధించుకొంటున్నాయి.
పేజీలు : 40