పోరు చరిత్ర
విలువలకు పట్టం కట్టిన అలనాటి రాజకీయ నాయకుల్లో మొదటి వరుసలో ఉండే వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య. తన బాల్యం నుంచి తెలంగాణ పోరాటం మీదుగా మార్క్సిస్టు పార్టీ నుంచి నక్సల్స్‌ చీలిక వరకు వివిధ అధ్యాయాలుగా రాసిన ఆత్మకథ ఈ పుస్తకం. ఆది నుంచి సుందరయ్య ఉద్యమాలలోనే ఉన్నారు. తెలంగాణ సాయుధ పోరులోని అన్ని విషాయలు ఆసక్తికరంగా ఉన్నాయి. శత్రు - మిత్ర వైరుధ్యాలు, పోరాటాన్ని నడిపిన నేతలు, వారిలో కొందరి బలహీనతలు, దళంలో మహిళలు, భర్తలతో తగువు పడినప్పుడు పార్టీ వారికి అండగా ఉన్న విధం, కేంద్ర కమిటీతో పేజీలు తదితరాలన్నీ చాలా చక్కగా వివరించారు. లేడీ మౌంట్‌బాటన్‌ భారత పర్యటనపై రాజ్యసభలో సుందరయ్య లేవదీసిన చర్చ, పర్యవసానాలు ఆసక్తికరంగా ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో ఆరు, ఆంధ్రలో పదకొండు లోక్‌సభ సీట్లను కమ్యూనిస్టులు కైవసం చేసుకోవడాన్ని సుందరయ్య ఘనంగా చెప్పుకున్నారు. అది చదువుతున్నప్పుడు 'ఏవి తల్లి నిరుడు కదలిన కమ్యూనిస్టు సమూహాలు...సుందరయ్య ఎక్కడ, రాజేశ్వరరావు మరెక్కడ..' అని సానుభూతిపరులు భావిస్తే తప్పుపట్టలేం. సరళమైన వాక్యాలతో అనువాదం బాగుంది. ఎన్నికయ్యారు, కాల్చివేశారు బదులుగా ఎన్నుకోబడ్డారు, కాల్చివేయబడ్డారు అని కృతకంగా ఎందుకు రాయాల్సి వచ్చిందో అనువాదకుడికే తెలియాలి. కొందరు రాష్ట్రేతర ప్రముఖుల పేర్లను నేరుగా రాసేశారు. కనీసం ఫుట్‌నోట్‌లో వారెవరో తెలియజేస్తే కమ్యూనిస్టేతర పాఠకులు అర్ధం చేసుకునేందుకు సులువుగా ఉంటుంది. - మద్దిపట్ల మణి

Write a review

Note: HTML is not translated!
Bad           Good