'చైనా ప్రజలు అజేయులు. ఎన్ని తుఫానులు వచ్చినా

మొక్కలు  వంగుతాయే తప్ప విరగవు. వాళ్ళూ అంతే'' - పెర్ల్‌ ఎస్‌.బక్‌

1949 నాటి విప్లవానికి ముందు దశకాల్లోని చైనా గ్రామీణ జీవితానికి, ముఖ్యంగా నిరుపేదల జీవన పోరాటానికి అద్దం పట్టింది ''సుక్షేత్రము'' (ది గుడ్‌ ఎర్త్‌).

1931 లో తొలిసారిగా అచ్చయిన ఈ నవల 1932లో అమెరికాలోని అత్యున్నత సాహితీ పురస్కారం పులిట్జర్‌ ప్రైజ్‌ అందుకుని యిప్పటికే ఆల్‌టైం బెస్ట్‌ సెల్లర్లలో ఒకటిగా నిల్చింది.

ఇది కష్టాలకడలిని ఈదిన బడుగు రైతు వాంగ్‌లుంగ్‌ సాహసగాధ. అతడి భార్య జమీందార్ల యింట్లో బానిస. దుర్భర జీవితానికి పరాకాష్ట అది. కష్టాలెపుడూ ఒంటిరిగా రావు - అన్న సామెతను నిజం చేస్తూ  ఆ ఏడు కరువు కూడా వస్తుంది. జనం ఆకలితో అలమటించి పోతారు. ఎవరికీ కూలి దొరకదు. నగరాలకు వలస పోక తప్పదు. అయితే పట్టణాల తళుకు బెళుకులే తప్ప అక్కడా కడుపు నిండదు. కొందరు రిక్షా కూలీలుగా, మరికొందరు ముష్ఠివాళ్ళుగా మారతారు.

ఆకలిదాడులు అనివార్యమవుతాయి. గంజి కేంద్రాలలో నిత్యం పోట్లాటలే. స్వదేశంలోనే కాందిశీకులుగా మారిపోతారు అన్నార్తులు.

పేదలకు బతుకంటేనే లేమితో చెలిమి. కడగండ్లను అధిగమించి, కష్టించి పనిచేసేవాడూ, భూమిని నమ్ముకున్నవాడిదే అంతిమ విజయం.

దురలవాట్లకు బానిసలై పతనమవుతుంది జమీందార్ల కుటుంబం. దురదృష్టాన్ని, క్షామాన్ని తట్టుకుని తన పొలాన్ని సుక్షేత్రంగా మార్చుకున్న వాంగ్‌లుంగ్‌ - పట్టుదల, అకుంఠిత కృషి వుంటే సాధించలేనిదేదీ లేదని రుజువు చేస్తాడు.

అత్యంత ప్రతిభావంతమైన కథనంతో, వుద్వేగభరితంగా సాగే ఈ నవల ఒకసారి ప్రారంభిస్తే ముగించకుండా వుండలేరు.

నోబెల్‌ బహుమతి గ్రహీత పెర్ల్‌ ఎస్‌.బక్‌ మూడు నవలల మాలికలో మొదటిది 'సుక్షేత్రం'. మిగతా నవలలూ సన్స్‌, ఏ హౌజ్‌ డివైడెడ్‌లలో కథ కొనసాగుతుంది. - ముక్తవరం పార్ధసారధి

Write a review

Note: HTML is not translated!
Bad           Good