స్తబ్ధత చలనం
అబద్ధం ముసుగుల కవతలి దృశ్యమేమిటి?
జీవితం ఘర్షణ
జీవితం సాధన
పాపినేని శివశంకర్ కనిపిస్తున్న దృశ్యాల వెనుక కదిలిస్తున్న శక్తుల్ని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కనిపిస్తున్న రూపాల వెనుక జరుగుతున్న నిర్మాణాన్ని పునాదులనుంచి పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ ప్రయత్నంలో ఆయనకు సమాజంలో కనిపించే రెండు రకాల 'స్తబ్ధత' కూడా అబద్దమని తేలిపోయింది. - వరవర రావు
కవిని నేను
కాళిదాసుకు వారసుణ్ణి నేను
కారణజన్ముణ్ణి నేను
కలం యోధుణ్ణి నేను
కవిత ఎలా పుడుతుందంటావా?
కాచుకో చెబుతాను
గంథర్వలోకంలో విహరిస్తాను
కళ్ళుమూసుకు కలలు గంటాను
అందమైన భావాన్ని సృష్టించి
అక్షర రూపాన్ని ప్రతిష్ఠించి
ఊహల వలువలు తొడిగి
ఒళ్ళంతా అలంకరించి
మెరుగుల్తొ మేకప్‌తో
నా కవితా వధువును ముస్తాబుచేస్తాను
అనుభవించనివాడు గాడిద
రామాయణం తిరగరాస్తాను
నాకే బోధపడని టెక్నిక్ సాధిస్తాను
మొహంమొత్తే శృంగారానికి కొత్త మాస్క్ తొడుగుతాను
మురిగిపోయిన వస్తువుతో తాజా వంట దింపుతాను
కవిని నేను
నా కవితలో ఏముందంటావా?
కాచుకో చెబుతాను
నా కవితలో కమ్మని కలలుంటాయి
అంతుచిక్కని ఊహలుంటాయి
అక్షరాల గమ్మత్తులుంటాయి
నా కవితకు రంగు ఉంది రసం ఉంది వాసనా ఉంది
అన్నిటినీమించి అనుభూతి నిలువెల్లా ఉంది
ఒక్క అక్షరం పిండితే నవరసాలు
ఒక్క వాక్యాన్ని దుర్బిణిలో చూస్తే నానా రహస్యాలు
కవిని నేను........