గుంటూరు జిల్లాలోని తాలూకా లన్నిటిలోనూ పల్నాడు పెద్దది. దీని వైశాల్యం దాదాపు 1050 మైళ్ళు. కృష్ణానది దక్షిణ తీరాన సముద్రానికి సుమారు 120 మైళ్ళ దూరంలో ఉన్నది. ఉత్తరాన, పశ్చిమాన రమారమి 80 మైళ్ళ పొడవున కృష్ణానది ప్రవహిస్తున్నది. దక్షిణాన కొండలూ, అరణ్యాలూ ఉన్నాయి. పల్నాటి నుండి శ్రీశైలం వరకూ నల్లమల కొండలు, అడవులు వ్యాపించి ఉన్నాయి. పల్నాటికి ఆ పేరు ఎట్టా వచ్చిందో నిర్ధారణ చేసి చెప్పడం కష్టం. నాడు అనగా దేశంలో కొంతభాగం, పాకనాడు, వెలనాడు, రేనాడు ఇట్టివే. పలనాడు, పల్లెనాడు, పాలనాడు మున్నగునవి నామాంతరాలు. పల్లవులు పాలించడం వల్ల పల్లవనాడు అను పేరు వచ్చి, తరవాత పలనాడు పల్నాడుగా మారిందని శ్రీ చిలుకూరి వీరభద్రరావుగారి అభిప్రాయం. పల్లవులు చాలా దేశం పాలించగా, ఈ ప్రాంతానికే పల్లవనాడు అని ఎందుకు పేరు వచ్చిందో తెలియదు. పాలరాయి ఇక్కడ విశేషంగా ఉండడం వల్ల పాలనాడనే పేరు వచ్చిందని, పల్లెలు మిక్కుటంగా ఉండడం వల్ల పల్లెనాడు అయిందని కొందరంటారు.

ఏమైనా పల్నాటి వీరగాధ ఒక కల, కల్పన కాదు, నిజం! ఇది కథకాదు, జరిగిన కథ. తెలుగువారి కథ. తెలుగు దేశంలో కథ! కాదు చరిత్ర. ఈ వీర చరిత్రకు ఇది సమగ్రమైన రూపం అని నేను భావించడంలేదు. నాటి పల్నాటి వీరుల పౌరుష, పరాక్రమాలను వేనోళ్ళ చాటి చెప్పే వీర చరిత్రపై ఇంకా ఎంతో పరిశోధన జరగవలసి ఉన్నది. ఎన్నో శాసనాలు పరిశీలించి, పరిశోధించి మరుగున పడి ఉన్న పెక్కు చారిత్రక విషయాలను వెలుగులోనికి తీసుకుని రావలసిన బాధ్యత తెలుగు విద్వాంసులపైన ఉన్నది. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good