శ్రీశ్రీ కథలు కూడా రాశాడా ? అని కొందరు వింతగా అడుగుతారు. ఒకటి కాదు. ఇవి మొత్తం ముప్పయి అయిదు. అయితే అన్నీ ఒకే సంపుటిలో చోటు చేసుకోవడం మాత్రం ఇదే మొదటిసారి. 'ఇవి కథలేనా ? వీటిని కథలనవచ్చునా?' అని మరికొందరి అనుమానం ఇంతకీ కథ అంటే ఏమిటి ? వ్యథే కథ. 'బాధ కవిత్వానికి పర్యాయపదం' అని ఇందులో ఒక కథ వుంది. ఆ కథ నిండా బోలెడు వ్యథ వుంది. అదంతా వర్ణించాడు, చెప్పాడు, చిత్రించాడు, చూపించాడు శ్రీశ్రీ. న్యాయానికి శ్రీశ్రీ దీనిని కథగానే చెప్పినా, ఎంతో ఒడుపుగా జోడుగుర్రాల స్వారీ చేశాడు. అందుకే దీనిని వ్యాసకథ అనవచ్చు. కథావ్యాసం అనీ పిలవచ్చు. దీనికన్నా రెండాకులు ఎక్కువ చదివిన కథ 'ఐశ్వర్యం ఎదుట దారిద్య్రం'. ఈ కథలో మూడంటే మూడే పాత్రలు - కుంటి బిచ్చ కుర్రవాడు, ఎగుమతి దిగుమతుల కంపెనీ భవనం, అరక్షణం మాత్రమే కనిపించే ఓ గోమాత. ఇంతే, కేవలం ఇవి మాత్రమే. తన పొట్టలోని పేగులన్నీ తెంచుకొని 'అంబా' అని అరుస్తాడా కుర్రాడు. అతని దీనాలాపం ఆ రాతిమేడ చెవిసోకదు. ఎందుకంటే అది సాయం సంధ్య, అప్పటికి ఆఫీసు మూసేస్తారు. కనక ఇక అక్కడ అప్పుడు పచ్చిమంచినీళ్ళు కూడా పుట్టవు. ఆఫీసు వేళల్లో మాత్రం కోట్లాది రూపాయలు చేతులు మారతాయి. 'అంబా' అనే అరుపు విని దోవనపోయే ఆవు తన పెయ్యేమో అనుకుని ఆగి, కాదని తెలుసుకుని కదిలిపోతుంది. అంబా అరుపు ఆగదు. కథ సాగదు. ఎలా ? ఆ కుంటి బిచ్చ కుర్రవాడు తలపైకెత్తి తలుపుకి వేసిన తాళం కేసి చూస్తేనే గాని ఈ కథకి ముగింపు వుండదు. ఒక రకంగా ఈ రెండూ కథ గురించిన కథలు, ముందున్నాయి జీవితంలో కథలు.
గుమస్తా మీద మూడు కథలున్నాయి. హెడ్డు గుమాస్తా, పేరు కోనేటిరావు, గుమాస్తా అతుకులబతుకు, అందులోని యాంత్రికత, రంగు, రుచి, వాసన, ఆశలు, ఆకర్షణలు లేని జీవయాత్ర. పగలంతా పుట్టెడు పని. ఆఫీసు ఫైళ్ళల్లో మునిగిపోవడం, రాత్రి మాత్రం హాయిగా కలల్లో తేలిపోతూ వుంటాడు. ఇంతలో తెల్లారిపోతుంది. తెల్లవాళ్ళు వెళ్ళిపోయిన తరవాత కూడా మన గుమాస్తాల బతుకులు ఇలాగే తెల్లవారుతున్నాయి.
ఈ కథాక్రమంలో ఒక్కొక్క రసం మీద ఒక్కొక్క కథ రాశాడు శ్రీశ్రీ. ఈ నవరసాల కథలు మాత్రం ఇంతవరకు పుస్తకరూపంలో రాలేదు. జ్యోతి మాసపత్రికలో 1976, ఆగస్టు నుంచి 1977 మే వరకు అచ్చయ్యాయి. ఇప్పుడీ సంపుటిలో వెలువడుతున్నాయి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good