వేదం అంటే ప్రత్యేకమైన జ్ఞానం, పవిత్రమైన జ్ఞానం.
వ+ఇదం వేదం అంటే ఇదంతా ఏమిటి? అదే తెలుసుకోవలసింది. ఏం తెలుసుకోవాలి?
ఇహం : అంటే భౌతిక శరీరంతో ఎలా బ్రతకాలి? అంటే శరీరాన్ని, మనసుని ఆరోగ్యంగా ఉంచుకోవడం, మన చుట్టూ శాంతి, ప్రేమలను పంచడం, మంచి సంతానాన్ని కని సంఘానికి వారు ఉపయోగపడేలా తయారు చేయడం.
పరం : భౌతిక శరీరం తర్వాత ఎలా బ్రతకాలి? అంటే ఆత్మ అభివృద్ధి, ఉన్నతి కోసం చేయవలసిన విధులు తెలుసుకోవడం, సాధన చేయడం, మన సాధన వల్ల లభ్యమయ్యే శక్తితో ఆత్మ ఉన్నతలోకాలకి ఎదుగుతూ, సాధనలో వెనక ఉన్న ఆత్మలకి సాయం చెయ్యడం.
ఈ రెంటినీ మనకి ఇచ్చేది; ఈ పుస్తకం.
అందుకే ఈ పుస్తకం నా దృష్టిలో వేదం. హిందూ మతానికి పునాదులైన వేదాలని ''అపౌరుషేయాలు'' అంటారు. అంటే ఎవరో మనుషులు వ్రాసినవి కాదు. ఋషులకి ట్రాన్స్‌ స్థితిలో స్ఫురించినవి. ఈ పుస్తకంలో విషయాలన్నీ గురుదేవులు శ్రీ శార్వరి గారు 40 సంవత్సరాలుగా ధ్యాన స్థితిలో అందుకుని, సాధనలో పరీక్షించి, నిగ్గు తేల్చుకున్న విషయాలే గాని, ఆయనకు అనుభవం కాని విషయం ఇందులో ఒకటీ లేదు.
అయితే భౌతిక శరీరం వదిలాక, అంటే చనిపోయిన తరువాత మన స్థితి ఏమిటో మనకి భౌతిక శరీరంతో ఉండగానే తెలియాలి. అప్పుడే మనం మరణాంతర జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోగలం. పరలోక జీవితానికి పునాది ఇహలోక జీవితం. అంటే ప్రాపంచిక జీవితం ఉన్నతంగా ఉంటే పరలోక జీవితం ఉన్నతంగా ఉండటానికి అవకాశాలు ఉంటాయి.
ఈ పుస్తకం వ్రాసిన ఆర్నెల కాలం గురువుగారు తపోదీక్షలో ఉన్నట్లే ఉంది. మనుషులు భూమ్మీద చేసే పనులు, ఆలోచనల పర్యవసానం, మరణానంతరం వారి అశరీర జీవితం మీద ఎట్లా ఉంటుందో ఈ పుస్తకంలో చాలా వివరంగా వ్రాశారు. 'మనిషి' పుట్టుక ముందు, పుట్టేటప్పుడు జరిగే ప్రక్రియ నుంచి, భౌతిక జీవితంలో శరీరం మనస్సు, కలిసి చేసే పనితీరు, చనిపోయే సమయంలో శరీరంలో జరిగే మార్పులు, రూపాంతరాలు చాలా క్లియర్‌గా వ్రాశారు.
ఇహానికి, పరానికి గోడలు కట్టిన హద్దులేమీ ఉండవు. శరీరం, అశరీరం అంతే తేడా. మృత్యువుతో మొదలయిన ఈ పుస్తకం, ఇహంలోకి వచ్చి, మనల్ని పరం యొక్క సుదూర తీరాలకి తీసుకుపోతుంది. అభౌతిక జ్ఞానాన్ని, భౌతిక స్థాయిలోకి అక్షరబద్ధం చేయడనికి గురువుగారి శారీరక శ్రమ చూసిన వాళ్ళకే తెలుస్తుంది. ఆయన వితరణ చేస్తున్న ఈ జ్ఞాన ప్రసాదాన్ని సాధన చేయడమే మనం ఇచ్చుకునే గురుదక్షిణ.
- ఎమ్‌.ఎస్‌.మూర్తి

Write a review

Note: HTML is not translated!
Bad           Good