ఆంధ్రప్రదేశ్‌ని సుదీర్ఘకాలం పరిపాలించిన రాజవంశం తూర్పు చాళుక్యులు. నేటి తీరాంధ్రం, రాయలసీమలో సగభాగం వీరి రాజ్యంలో భాగం. వీరి పరిపాలనాకాలంలో సాహిత్యపరంగా, సాంస్కృతికంగా గొప్ప మార్పులు సంభవించాయి. ద్రాక్షారామ భీమేశ్వరాలయం, సామర్లకోట భీమేశ్వరాలయం, పొందుగుల జల్పేశ్వరాలయం, బిక్కవోలు ఆలయాలు, చేబ్రోలు భీమేశ్వరాలయం, తూర్పు చాళుక్యుల కాలంలోనే నిర్మితమయ్యాయి. ఆంధ్రుల తొలికావ్యం వీరి కాలంలోనే ప్రభవించింది.

రాజరాజ నరేంద్రునికి క్రీ.శ. 1022 ఆగస్టు 16 (భాద్రపద బహుళ విదియ) నాడు పట్టాభిషేకం జరిగింది. ఈ ఘటన జరిగి 900 సంవత్సరములు పూర్తయిన సందర్భంగా 1922లో భావరాజు వేంకటకృష్ణరావు శ్రీ రాజరాజ నరేంద్ర పట్టాభిషేక వుత్సవాన్ని జరిపి ఒక సంచికను ప్రచురించాలని తలపెట్టారు. ప్రముఖ విద్యావేత్త, సాహిత్యవేత్త కట్టమంచి రామలింగారెడ్డి అధ్యక్షతన ఉత్సవాన్ని ఘనంగా రాజమహేంద్రవరంలో జరిపారు.

    మల్లంపల్లి సోమశేఖరశర్మ, కొమఱ్ఱాజు వేంకటలక్ష్మణరావు, మల్లాది సూర్యనారాయణశాస్త్రి, చిలుకూరి నారాయణరావు, చిలుకూరి వీరభద్రరావు, గిడుగు రామమూర్తి, పెండ్యాల వెంకట సుబ్రహ్మణ్యశాస్త్రి మున్నగు నాటి హేమాహేమీలైన   పండిత పరిశోధకులతో విశ్లేషణాత్మకమైన వ్యాసాలు రాయిచి పట్టాభిషేకం సంచికను ప్రచురించారు. ఈ సంచికను చెళ్లపిళ్ళ వేంకటశాస్త్రి, రాయప్రోలు సుబ్బారావు, చిలకమర్తి లక్ష్మీనరసింహం, వేటూరి ప్రభాకరశాస్త్రి కవిపుంగవులు తమ పద్యహారాలతో అలంకరించారు.

    భావరాజు వారు ప్రచురిచిన రాజరాజ నరేంద్ర పట్టాభిషేక సంచిక ఈ తరహా సంచికలో మొట్టమొదటిది. ఒక రాజు కాలమునాటి సాంఘిక, సాహిత్య పరిస్థితులను విశ్లేషిస్తూ అంతకుముందెన్నడూ ఇటువంటి సంచికను ప్రచురించలేదు. విశిష్ట వ్యక్తులచే ప్రచురించబడిన ఇలాంటి విశిష్టమైన సంచికను తెలుగు సాహిత్యప్రియులకు, చరిత్రప్రియులకు అందుబాటులోకి తీసుకురావాలనే సదుద్దేశంతో బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్‌ (గుంటూరు) మోదుగుల రవికృష్ణ సంపాదకత్వంలో పున:ప్రచురించింది.

    1922కి, 2015కి దొరుకుతున్న తూర్పు చాళుక్యుల వివరాలు వేరు. అందుకని సంచికను అనుబంధాలతో, పాదసూచికలతో, తూర్పు చాళుక్యుల పాలనాస్థావరాలకి సంబంధించిన ఛాయాచిత్రాలతో, చక్కటి రాజరాజు ముఖచిత్రంతో సర్వాంగసుందరంగా బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్‌ (గుంటూరు) వారు ప్రచురించడం చరిత్రప్రియులు ఆనందించదగిన విషయం. తక్కువ వెలతో అందరికీ అందుబాటులో ఉంచటం మరింత సంతోషించదగిన విషయం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good