మహాభారతమును ఎందుకు చదవాలి
శ్రీ మద్రామాయణము, మహాభారతములలోని వ్యక్తులు, సంఘటనలు మన భారతజాతిని ప్రభావితం చేశాయి అన్నది సుస్పష్టం. ఛత్రపతి శివాజీ, మహాత్మాగాంధీ, స్వామివివేకానంద ఇంకెందరో మహానుభావులకు మార్గదర్శమైనాయి. మన ఇళ్ళలో పసిపాపలు తల్లి ఒడిలో కూర్చుని తొలి పాఠాలు నేర్చుకునేది ఈ రామాయణ, భారత గాథలు వినే. సీతాదేవి, ద్రౌపదిదేవి పడిన కష్టాలు, శ్రీరాముడు, అర్జునుడు యొక్క వీరోచిత కార్యాలు, లక్ష్మణుడు, ఆంజనేయుడు వంటి ప్రేమాస్పద వ్యక్తులు, కర్ణుని దానగుణము, ధర్మరాజు యొక్క ధర్మనిష్ఠ మానవుల తొలి అడుగులకు మార్గదర్శకంగా నిలుస్తాయి. కాలక్షేపం కొరకు ఉద్దేశింపబడిన హరికథలు, బుర్రకథలు, యక్షగానాలు, నాటకాలలో ఈ పాత్రల ఔన్నత్యాన్ని ప్రదర్శించబడతాయి. ఈ మహాపురాణాలు ఒక్క భారతదేశానికేగాక, సర్వప్రపంచానికి, అన్ని కాలాలకు ప్రతిబింబాలు.
వ్యాసమహాభారతములోని పాత్రలన్నీ నిజజీవితానికి దగ్గరగా ఉంటాయి. మహావీరుడు భీష్ణుడు, సకలవిద్యావేత్త ద్రోణాచార్యులు, విధివంచితుడు కర్ణుడు, అభిమానధనుడు దుర్యోధనుడు, కష్టాలను ధైర్యంగా ఎదుర్కొన్న పాండవులు, అత్యంత దురదృష్టవంతురాలైన మహారాణి ద్రౌపదీదేవి, వీరమాత కుంతీదేవి, భర్తకు అత్యంత విధేయురాలు, దుష్టులైన కుమారుల ఆగడాలను సహించలేకున్నా మిన్నకుండిపోయిన గాంథారీదేవి, ఇంకెందరో సజీవ శిల్పాలు. ఇంకా జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ.
కురుక్షేత్ర మహాసంగ్రామములోని యుద్ధనీతి, యుద్ధకౌశలము, శస్త్రా నైపుణ్యము నభూతో, నభవిష్యతి అన్నట్లుగా వివరింపబడినాయి. ఒక్క ద్రోణపర్వము చదివితే నాలుగు వేదములు చదివిన ఫలితం వస్తుందనటానికి ఇది నిదర్శనము.