అసలు విజేత అంటే ఎవరు? విజయం అంటే ఏమిటి? విజయం సాధించడమంటే కేవలం డబ్బు సంపాదించడమేనా.. ఒకవేళ అది పాక్షిక సత్యమే అనుకుంటే మనిషి ఎంత డబ్బు సంపాదిస్తే సంతృప్తమౌతాడు. అనంతానంత స్థాయిలో సంపాదించి ప్రంపచ ధనవంతునిగా ఎదిగిన తర్వాత ... తర్వాత ఏమిటి? ఈ డబ్బు లేక సంపద సంపాదనకంటే పరమమైన సాధన ఏదైనా ఉందా. ఉంటే అది ఏమిటి... ఆ స్థితిలో మనిషి తనను తాను తవ్వుకుంటూ, ఇసుకనేలను తవ్వితే చెలిమె బయటపడ్డట్టు వ్యక్తి తనను తాను ఆత్మాన్వేషణలో వియుక్తపర్చుకుంటూ విముక్తత గురించి ఆలోచించడం ప్రారంభించిన తర్వాత.. చుట్టూ అప్పటిదాకా కనిపించిన తన జీవితం, తనకు తెలిసిన ఇతరుల జీవితాలు కొంగ్రొత్త రూపురేఖలతో దర్శనమౌతూ... అదే పాత సూర్యుడు కొత్తగా కనబడి, అదే పాత భూమి కొత్తగా తెలిసి... అదే పాత గాలి, అదే పాత చెట్టు, అదే పాత నీరు... అన్నీ కొత్తగా, వింతగా, వినూత్నంగా పరిచయమౌతున్నవేళ...మనిషి మ¬ద్విగ్నుడై విచలితుడైపోతాడు. ఒక ఎడతెగని మథన.. మొదలౌతుంది. మనిషి అంతర్ముఖుడై ముందు తనను తాను, తర్వాత ప్రపంచాన్ని 'తెలుసుకోవడం' ప్రారంభిస్తాడు. ఆ స్థితి అప్పటిదాకా మూసి ఉన్న కొత్త తలుపులను తెరుస్తుంది. కొత్త లోకాన్ని చూపిస్తుంది. కొత్త జీవితంలోకి నడిపిస్తుంది. అప్పుడు. నిజమైన విజయం అంటే ఏమిటి... ఎవరు నిజమైన విజేత, మనం నడువవలసిన దారి ఏమిటి.? ... గమ్యం ఏమిటి... ఏది అంతిమం, ఏది పరమం, ఏది శాశ్వతం.. ఏది అశాశ్వతం అని తెలియజేస్తూ మనిషికి ఏది అవసరమో అనేదానికంటే ఏది అవసరంలేదో తెలియపరుస్తుంది. అది 'స్పృహ...', 'ఎరుక'. ఆ 'ఎరుక'ను కలిగించే ప్రయత్నాన్ని ప్రముఖ కవి, రచయిత రామా చంద్రమౌళి ఈ 'స్ఫూర్తి ప్రదాతలు' పుస్తకంలో సశాస్త్రీయంగా, విశ్లేషణాత్మకంగా, చక్కని అన్వయింపుతో, ప్రత్యేకమైన కవిత్వ భాషలో చెప్పారు.
- జూలూరు గౌరీశంకర్
Pages : 196