2016 నవంబర్‌ 8వ తేదీన రూ.500, 1000 నోట్లను రద్దుచేసిన మన ప్రధానిగారిని గురించి బహుముఖ వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. గొప్ప రాజనీతిజ్ఞుడు, దూరదృష్టిగలవాడని కొంత మంది కీర్తించగా, అలనాటి తుగ్లక్‌ తిరిగి పుట్టాడేమోనన్నారు మరికొంతమంది.

సుమారు పదిహేనున్నర లక్షలకోట్ల రూపాయల నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించి (రద్దుచేసి) కేవలం మూడున్నర లక్షల కోట్ల రూపాయలతో యాభైరోజులపాటు సర్దుబాటు చేసుకోమని సుద్దులు పలికింది పాలకవర్గం. డబ్బున్న వాళ్ళ పరిస్థితివేరు, మా గతేంటని సామాన్య జనం గగ్గోలు పెడుతుంటే ''నగదు రహితం'' దోవలో పయనించమని ఉచిత సలహాలు పారేస్తూ జనాన్ని పక్కదోవ పట్టిస్తున్నారు.

పాలకవర్గం రోజుకో మాట, పూటకో కూత కూస్తూనే వున్నారు. నగదు పరిమితులు పెంచడాలు, తగ్గించడాలు, స్త్రీల మెడల్లోని బంగారాన్ని సహితం లాగి తూకమేసి లెక్కలు కట్టడాలు, డిజిటల్‌ లావాదేవీలు దేశాన్ని నడిపిస్తాయనడాలు, పన్నుల వసూళ్ళు పెరుగుతాయనడాలు, నల్లధనాన్ని తవ్వి తీస్తున్నామనడాలు వగైరాలన్నీ ఆ నల్లధనాన్ని అరికట్టే ఏకైక మంత్రదండం రద్దేనంటూ ఉత్తరకుమార ప్రజ్ఞలు చేస్తున్నారుగాని సామాన్యుల గోడు పట్టించుకోవడంలేదు. నోట్ల రద్దు తర్వాత ఆ ప్రభావం సామాన్య ప్రజలపై ఏ విధంగా ఉన్నదీ ఏటీఎంల వద్ద, బ్యాంకుల వద్ద క్యూ లే నిదర్శనం. నోట్ల రద్దు నిర్ణయం తర్వాత దేశంలో జరిగిన పరిణామాలను ప్రముఖ పాత్రికేయులు, మేధావులు, ఆర్థిక నిపుణుల విశ్లేషణాత్మక వ్యాస సంకలనమే 'కరెన్సీ కరువు' గ్రంథం.

Pages : 152

Write a review

Note: HTML is not translated!
Bad           Good