కొంతకాలం క్రితం ఒకరోజు మా ఆసుపత్రిలో పేషెంట్లను చూస్తున్నాను. ఒక రోగి 'కన్సల్టేషన్ రూమ్' లోకి వచ్చాడు. రోగిని పరీక్షించేముందు అతని పేరు, కులం, ఊరు, వయసు వగైరా వివరాలను 'స్టాటిస్టికల్ పర్పస'్ కోసం నమోదు చేయాలి.
అవన్నీ అయ్యాక ''ఏం చేస్తుంటావు?'' అని అడిగాను.
అతడు ''అడుక్కు తింటుంటా'' అన్నాడు.
''అది సరే నీ కుల వృత్తి ఏమిటి?'' అనడిగాను.
అతడు, ''అడుక్కు తింటాం'' అన్నాడు.
''చూడు బాబూ. నేను రాసుకోవాలి. నీ కులవృత్తి ఏమిటో చెప్పు'' అన్నాను.
అతడు ''మా కులపోళ్లంతా చేసేది అదే. అందరం అడుక్కుతింటాం'' అన్నాడు.
తర్వాత తెలిసిందేమిటంటే అడుక్క తినడమే కులవృత్తిగా గల కులాలు ఈ దేశంలో డజనుకుపైగా వున్నాయట.

ఈ దేశంలో వ్యవస్థీకృతమై వున్న ఈ భ్రష్టకారి కుల వ్యవస్థ మీద పోరాటం దాదాపు రెండువేల సంవత్సరాల నుంచి సాగుతున్నది.
ఇన్ని వేల యేండ్లుగా ఏ కులమైతే తనను అవమానాలకు, అమానవీయతకు, హైన్యతకు గురిచేస్తూ వచ్చిందో ఆ కులనామాన్ని తన పేరు చివరన నేడు దళితుడు రాసుకుంటున్నాడు.
అ లా రాసుకోవడం ద్వారా తన ఆత్మగౌరవాన్ని, తద్వారా తన సాంఘిక సమానత్వాన్ని నిర్ద్వంద్వంగా, బాహాటంగా ప్రకటించుకున్నాడు.
ఈ శతాబ్దంలో సగర్వంగా చెప్పుకోదగిన సాంఘిక చైతన్యంగా దీనిని భావించడానికి ఏమాత్రం తటపటాయించనవసరంలేదు.

ఐతే ఈ సాంఘిక చైతన్యం బాహ్యశక్తులతో పోరాడి సంపాదించింది కాదు.
వేలయేండ్లుగా తనను అంటిపెట్టుకుని వుండిన ఆత్మన్యూనతతో పోరాడి, దానిని ఛేదించి తన జీవితాన్ని మెరుగుపరచుకునే క్రమంలో నేడు దళితుడు ఒకానొక కీలకమైన మజిలీని చేరుకున్నాడు.
ఇలా సాధించుకున్న 'సాంఘిక' సమానత్వం దానికదే అతని జీవితాన్ని గుణాత్మకంగా మార్చడానికి నిర్వహించగల పాత్ర ఎంత?
ఈ ప్రశ్నకు సమాధానం ''సున్న'' అని చెప్పాల్సి వుంటుంది.
కానీ 'సున్న' కు విలువ లేదని ఏ గణిత శాస్త్రజ్ఞుడైనా అనగలడా?
అనలేడు.
సున్నాకు ముందు 'అంకె' చేరితే దానికి ఎనలేని విలువ సమకూరుతుంది. ఆ అంకె పేరే ఆర్థిక సమానత్వం.
-డా.కేశవరెడ్డి

Write a review

Note: HTML is not translated!
Bad           Good