నాలుగు దశాబ్ధాలుగా నిరంతరం కవిత్వాన్ని సృజించే కవి రాసిన వచనంలోని మేలిమి హృదయాన్ని తాకుతుంది. ఎక్కడ వున్నా, ఏం చేస్తున్నా, సంకల్పితంగా, అసంకల్పితంగా కవిత్వం గురించి ఆలోచించే కవి వచనం రాస్తే ఎలా వుంటుంది. ఆ వచనం తీరుతెన్నులు ఎలా వుంటాయో తెలుసుకోవాలంటే శివారెడ్డి ముందుమాటల్ని ప్రత్యేకంగా చదవాలి.
''ఎప్పటి ప్రేమ యిది? 40 ఏళ్ళ కిందటి ప్రేమ. ఇప్పటికీ మొగలిపూల వాసనలా లోనంతా అల్లుకుని తాచుపాములా వెంటాడుతున్న ప్రేమ. యౌవనోద్రేకపు ప్రేమ. ఉత్తుంగజలధి తరంగాల్లా ముంచెత్తిన ప్రేమ. బహుశ లోలోపల రవళిస్తూ నాలుగు దశాబ్దాల పాటు నన్నావరిస్తున్న ప్రేమ పరిమళం. ఒక స్వప్నం. పగబట్టి వేటాడే స్వప్నం, నన్ను యక్షుణ్ణి చేసి, గానగంథర్వుణ్ణి చేసి పామ్బీచ్ ఇసుక రేణువుల్లోంచి వెల్లివిరిసిన ప్రేమ. ఎంకిపాటలై గాలి నిండా అల్లుకున్న ప్రేమ. బహుశా ఎన్నో తరాలు, ఎంతో మంది పూర్వికుల అవ్యక్త ప్రేమలన్నీ అలా గాల్లో మిళితమై నన్నావరించి-
ఇన్నేళ్ళ తర్వాత, ఇన్నేళ్ళ యుద్ధాల, వత్తిడుల నలుగుళ్ళ తర్వాత మళ్ళా ఎందుకు విద్యాసాగర్ కదిలించాడీ తేనే తుట్టెను!? ఎవడో పుల్లతో పొడిస్తే ఒక్కొక్క బొట్టు తేనె, తుట్టె నుంచి రాలుతున్నట్లు-''
ఇది ఒకే ఒక్క ఉదాహరణ. ఇలా శివారెడ్డి రాసిన వచనంలోంచి అనేకం ఉదహరించి వారి వచనంలోని సౌందర్యాన్ని, శిల్ప విన్యాసాన్ని గురించి ఎంతయినా చెప్పవచ్చు.