నాగరికతా ప్రక్రియ తప్పనిసరిగా వాంఛల అణచివేతకు దారి తీస్తుందని, దీనికి సకారాత్మక పరిష్కారం సహజాత శక్తిని పృజనాత్మక, శాస్త్ర, సాంకేతిక, మానవీయ రంగాలలో కృషిలోకి మళ్ళించడం కాగా, ఇది సాధించలేని వ్యక్తులలో ఈ అణచివేత మానసిక రుగ్మతకు కారణమవుతుందని ఫ్రాయిడ్ ఈ పుస్తకంలో ప్రతిపాదించాడు. ఈ సమాజ జనిత ఆంక్షలు, నిషేధాలు ముఖ్యంగా లైంగికత విషయంలో అమలు చేయబడతాయని, ఇందుకు పునాది మనిషి ద్విపాద జీవిగా రూపొందిన క్రమంలోనే ఉందని ఫ్రాయిడ్ భావన. మానవునికుండే సహజాతాలలో దౌర్జన్యత చూపలేనప్పుడు, అది మనిషి అంతరాత్మపై అజమాయిషీ చేయడం ద్వారా, వ్యక్తిని వ్యాకులతకు గురిచేస్తుంది. బాహ్యకప్రపంచ దిశగా ఇది మరల్చబడినప్పుడు, ఘర్షణలకు, యుద్ధాలకు దారితీస్తుంది. ఈ దౌర్జన్య సహజాతం మృత్యుసహజాతానికి, జీవనసహజాతానికి మధ్య జరిగే పోరాట క్రమమే నాగరికత. దౌర్జన్య, మృత్యుసహజాతాల వాస్తవికతపై విమర్శలు వెలువడినప్పటికీ, మానవ స్వభావాన్ని, వ్యక్తి - సమాజానికి మధ్య ఉండే సంబంధాన్ని, సామాజిక పరిణామ క్రమంలో ఏర్పడే ఘర్షణలు, వైరుధ్యాలను అర్థం చేసుకోవడానికి ఈ పుస్తకం ఉపయోగపడవచ్చు. నాగరికతల మధ్య ఘర్షణ పేరిట యుద్ధం - శాంతి మధ్య తేడాను గందరగోళ పరుస్తున్న భావజాలం చలామణి అవుతున్న వర్తమాన ప్రపంచాన్ని అవగాహన చేసుకోవడానికి కూడా ఇటువంటి పుస్తకాలు అవసరం.
ఈ పుస్తకాన్ని అనువదించిన అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి గారు మనో విశ్లేషణ సిద్ధాంతాన్ని, తెలుగు పాఠకులకు పరిచయం చేస్తూ 'స్వప్న సందేశం', 'మనసుమర్మం' అనే పుస్తకాలు రచించారు.
పేజీలు : 113