పుస్తకం మనిషిని కదిలించగలదు!

    మారాలనుకున్నవాడే మారతాడు. మార్పు చెందాలనుకున్న క్షణమే మార్పు మొదలవుతుంది. గతానికి, వర్తమానానికి తేడా లేకపోతే, మార్పు లేకపోతే భవిషత్తు పేలవంగా వుంటుంది.

    జీవితోత్సాహం ఉన్నవాళ్ళకి, అదిలేనివాళ్ళకి స్పష్టమైన తేడా వాళ్ళమాటల్లో, అక్షరాల్లో, ఆచరణల్లో అడుగడుగునా తెలిసిపోతూనే వుంటుంది. పైకి సాధారణంగా అనిపించే సంఘటనలే మనుషుల్ని జాగృతం చేస్తాయి. అద్భుతాలు సృష్టించడానికి కారకాలవుతాయి. సున్నితమైన మనసు, సునిశితమైన బుద్ధి కలిగిన వాళ్ళే జీవితంలో ఏదో ఒకరోజు అద్భుతాన్ని సాధించి తీరుతారు. ఏ దేశంలో అయినా, ఏ కాలంలో అయినా అద్భుతాలు సృష్టించిన వాళ్ళు, ఆవిష్కరించినవాల్ళు మొదట అనామకంగా ఉండినవాళ్లే. ఏ శక్తి, ఏ ప్రేరణ వారిని స్పందింపజేసి చరిత్ర సృష్టించేలా మార్చిందో ఆ శక్తి, ఆ ప్రేరణల గురించి మనం తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది.

    'ఆత్మవిశ్వాసం, పట్టుదల, ఏకాగ్రతలే చదువుకు కొలమానాలు. జ్ఞానం నీకు శక్తిని యిస్తుంది. వ్యక్తిత్వం గౌరవాన్ని యిస్తుంది'' అని ఈ పుస్తకంలో డి.రామచంద్రరాజు అభిప్రాయపడ్డారు. తొమ్మిది అధ్యాయాలు గల ఈ పుస్తకంలో తెలుగు, ఆంగ్లభాషలతో సహ చరిత్ర, సామాజిక, సాహిత్య, కళా, సాంస్కృతిక, శాస్త్ర సాంకేతిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లోని అనేకానేక విశేషాల గురించి, ఆశ్చర్యకరమైన ఆవిష్కరణల గురించి, మనుషుల్ని మార్చిన సంఘటనల గురించి, ఆవిష్కరణలకు ప్రేరకాలైన శక్తుల గురించి సులభశైలిలో, ఆసక్తికరంగా, గ్రామీణ ప్రాంత చదువరి సైతం ఇష్టంగా చదువుకొనేలా చాలా విషయాల గురించి రచయిత వివరించారు.

    వివిధ రంగాలకు, వివిధ స్థల, కాలాలకు సంబంధించిన అనేకమంది అద్భుతమైన వ్యక్తుల గురించిన సంగతులెన్నింటినో ఈ పుస్తకంలో చూడవచ్చు.

- పలమనేరు బాలాజి

Write a review

Note: HTML is not translated!
Bad           Good